తెలుగు రాష్ట్రాలతోపాటు, చెన్నైలో పలు కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ జరిపిన సోదాలు సంచలనం సృష్టించాయి. 14 బ్యాంకుల కన్సార్డియం ఏడేళ్ల కిందట హైదరాబాద్ కు చెందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు రూ. 7926 కోట్లు రుణం మంజూరు చేసింది. మరో ప్రైవేటు కంపెనీకి రూ.313 కోట్లు రుణాలు ఇచ్చారు. రుణాలు తీసుకున్న కంపెనీలు ఎగవేతకు పాల్పడంతో వాటిని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. దానితోపాటు, కావాలనే రుణ ఎగవేతకు పాల్పడ్డారని సీబీఐకి కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు ట్రాన్స్ టాయ్ కంపెనీ యజమాని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
దారి మళ్లించారు
14 బ్యాంకుల కన్సార్డియం నుంచి భారీగా రుణాలు తీసుకున్న రెండు ప్రైవేటు కంపెనీలు రుణం ఎగవేతకు పాల్పడ్డాయి. ఈ కంపెనీలను బ్యాంకులు డిఫాల్టర్ గా ప్రకటించాయి. తీసుకున్న రుణాలను వేరే వ్యాపారాలకు మళ్లించడం, తప్పుడు బ్యాలెన్స్ షీట్లు తయారు చేయడం, అకౌంట్స్ తారుమారు చేయడం వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడినట్టు కెనరా బ్యాంకు ఫిర్యాదులో పేర్కొంది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి రుణాలు ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్డియానికి కెనరా బ్యాంకు లీడ్ బ్యాంకుగా ఉంది. 14 బ్యాంకుల నుంచి మొత్తం రూ.7926 కోట్లు రుణం తీసుకున్న ట్రాన్స్ టాయ్‌కు కెనరా బ్యాంకు కూడా రూ.678 కోట్లు రుణం ఇచ్చింది. ఈ రుణాలను కావాలనే ఎగవేసినట్టు కెనరా బ్యాంకు కన్సార్డియం గుర్తించింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, చెన్నైలోనూ సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.











