ఏఐసీసీ అధ్యక్షపీఠం అందుకోవడానికి తనకు ఇష్టం లేదంటే లేదని.. రాహుల్ గాంధీ గతంలో పలుమార్లు కుండబద్దలు కొట్టి పారేశారు. సాధారణంగా అయితే.. ‘జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేళ్లాడే’ బాపతు రాజకీయ నాయకులుంటారు. కానీ.. రాహుల్ విషయంలో ఆయన నాకొద్దు మొర్రో అని లగెట్టుకుని పారిపోతోంటే.. ఆయన జుట్టుపట్టుకుని లాక్కొచ్చి చూరుకు వేళ్లాడదీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
శనివారం నాడు సోనియా నిర్వహించిన కీలక సమావేశంలో సోనియా గ్రూపుకు చెందిన అనేక మంది కీలక నేతలతో పాటు, సోనియాపై తిరుగుబాటుగా ఇటీవలి కాలంలో ప్రచారంలోకి వచ్చిన లేఖ రాసిన సీనియర్లు కూడా పలువురు హాజరయ్యారు.
అయితే సమావేశం ముగిసేసరికి.. రాహుల్ నే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టవలసిందిగా అందరూ కోరుతున్నారని, ఆయనకూడా పార్టీ ఏం చెబితే అది చేస్తా.. అన్నట్టు నర్మగర్భాలంకారం వేసి.. సెలవిచ్చారని వార్తలు వస్తున్నాయి. అయితే సీనియర్ల అసంతృప్తులను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ పలుదఫాలుగా చింతన్ బైఠక్ లు కూడా నిర్వహించడానికి సోనియా ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
నెహ్రూ-ఇందిర-రాజీవ్-సోనియా కుటుంబం తప్ప.. మరొకరి చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దేశంలో ఠికానా ఉండదు అనే భయానికి పార్టీలోని చాలా మంది నాయకులు మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. అలాంటి నేతలు మాత్రమే.. రాహుల్ సారథ్యం మాత్రమే కావాలని పదేపదే ఆరాటపడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో పార్టీని సముద్ధరించడానికి ఏమేం చేయాలనే విషయంలో సంస్థాగత నిర్మాణం.. కిందిస్థాయి నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి పదవులు అప్పగించడం వంటి అనేక ప్రతిపాదనలు కూడా సోనియాతోభేటీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే, పార్టీ కార్యకర్తలను, పార్టీకోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారిని పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా పలువురు అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఇన్ని చర్చలు సాగిస్తున్నారే తప్ప.. కిందిస్థాయి నుంచి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే ఎన్నికలనే కొనసాగిస్తూ.. రాష్ట్ర కమిటీల, జాతీయ కమిటీల సారథులకు కూడా పగ్గాలు అప్పగిస్తే.. దానివల్ల ప్రయోజనం ఉంటుందనే దిశగా వారి ఆలోచనలు మళ్లడం లేదు. అలాంటి కసరత్తు జరిగితే గనుక.. తమ తైనాతీలను, పార్టీకంటె కూడా వ్యక్తులకు విధేయంగా ఉండేవారిని రాష్ట్ర పదవుల్లో కూర్చోబెట్టడమూ.. యువరాజు రాహుల్‌కు అధ్యక్షపీఠం అప్పగించడమూ సాధ్యం కాదనే భయం వారిలో ఉన్నదేమో అనే శంక కూడా కలుగుతోంది.
తిరిగి ప్రాణం పోయాలి..
కాంగ్రెస్ పార్టీకి తిరిగి ప్రాణం పోయాలనేది సోనియా తాజా మాట. గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ కు మాత్రమే పరిమితమైన పార్టీ సమావేశాలు.. తాజాగా సోనియా ఇంటిలో ముఖాముఖి జరగడం కూడా ఆమె పార్టీ బాగుకోసం సీరియస్‌గా పట్టించుకుంటున్నారనడానికి ఒక సంకేతం. ఏకంగా అయిదు గంటలపాటు ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని తీర్మానాలైతే చేశారు. అయితే అదే సమయంలో రాహుల్ మాత్రం ఎప్పటిలాగానే సీనియర్ల వైఖరిపై కాస్త ఘాటుగానే మాట్లాడినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ.. ఆరెస్సెస్-భాజపా దళాలతో కాంగ్రెస్ సీనియర్లు కొందరికి సంబంధాలు అంటగట్టడానికి రాహుల్ ప్రయత్నిస్తూనే ఉన్న సంగతి అర్థమవుతోంది.
ఈ భేటీలో ఎవ్వరూ రాహుల్ ను విమర్శించలేదని, అందరూ ఆయనకు మద్దతుగా నిలిచారని సమావేశం అనంతరం నేతలు చెప్పుకోవడాన్ని గమనిస్తే.. ప్రజల్లోకి ఎలాంటి ప్రచారం వెళుతుందనే భయంతో.. వారు సతమతం అవుతున్నారో అర్థమవుతుంది. మరి రాహుల్ ను పార్టీ మీద రుద్ది.. పార్టీకి పునరుజ్జీవం అనే గొప్ప లక్ష్యాన్ని వారు ఎలా అందుకుంటారో వేచిచూడాలి.
Also Read: మద్దతిచ్చిన పార్టీల్లో రైతులపై గౌరవం ఎంత?