గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా మంచి ఊపు వచ్చింది. ఎవరికి కదిలించినా బీజేపీ గురించి చర్చే సాగుతోంది. దీంతో ఇక రూరల్ ఏరియాపై దృష్టి సారిస్తోంది బీజేపీ అధిష్టానం. జిల్లాల్లో పెద్దగా పట్టులేని బీజేపీ ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలను చుట్టివచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. రూట్ మ్యాప్ ను సిద్దం చేసుకున్న సంజయ్ ఇక జిల్లా, పల్లెబాట పట్టబోతున్నారు.
దక్షిణ తెలంగాణతో మొదలు..
పార్టీకి ఉత్తర తెలంగాణతో పోల్చితే దక్షిణ తెలంగాణలో కాస్త పట్టుంది. కేడర్ ఉన్నా వారంతా పెద్దగా యాక్టివ్‌గా లేని పరిస్థితి. దీంతో వారిలో ఉత్సాహం నింపేందుకు సంజయ్- నారాయణ పేట జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే రైతు సమ్మేళనంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రైతలుకు ఈ చట్టాలపై అవగాహన కల్పిచేందుకు ఆయన ఈ పర్యటనను వినియోగించుకోనున్నారు. అక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలపై సమావేశం అయ్యే అవకాశం ఉంది.
నారాయణ పేటలో పార్టీకి మంచి బలం ఉంది. అయితే పార్టీ తరఫున కేడర్‌ను ఉత్సాహపరిచే నేతలు లేకపోవడంతో వారంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపడం లేదు. దీంతో సంజయ్ యాత్రతో కేడర్ లో కొత్త జోష్ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్‌లోనూ వివిధ నియోజకవర్గాల్లో పర్యటన..
టీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టున్న కరీంనగర్‌లోనూ బీజేపీని ప్రజలకు చేరువ చేసేందుకు పర్యటనలు చేయబోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, కరీనగర్ లలో రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ఆయన పర్యటన ఎలా సాగుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించి తీరుతామని అటు అరవింద్ , ఇటు సంజయ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సంజయ్ అక్కడ ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు. టీఆర్ఎస్ కేడర్‌ను ఎలా తమ వైపు తిప్పుకోబోతున్నారన్నది ఆసక్తికరమైన అంశం. ఇక్కడ టీఆర్ఎస్‌కు మంచి పట్టుంది… కేటీఆర్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. టీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్ ను ఓడించాలంటే బీజేపీ కి ప్రస్తుతం ఉన్న స్ట్రెంత్ సరిపోతుందా అన్నది చూడాలి.గత ఎన్నికల్లో రంగారెడ్డి , మెదక్ జిల్లాల్లో సత్తా చాటింది టీఆర్ఎస్. ఇక్కడ కూడా ఆ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయడం పై సంజయ్ దృష్టి సారించారు. వికారాబాద్ నియోజకవర్గంలో 23న సంజయ్ పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ వర్గాలతో సమావేశం కాబోతున్నారు . గ్రేటర్ హైదరాబాద్‌లో సత్తా చాటిన బీజేపీకి పొరుగున ఉన్న వికారాబాద్‌లో ఖచ్చితంగా బలం పెరుగుతుందని భావిస్తున్నారు సంజయ్
ఆ తరువాత ఈ నెలాఖరులోనే నల్లగొండ జిల్లాలో సైతం ఆయన పర్యటనలు పెట్టుకున్నారు. దీని ప్రభావం నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఉంటుందన్న భావనలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజక వర్గాలు చుట్టి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఏయే అంశాలను ప్రజల మధ్యకు తీసుకు వెళ్తారు.. ప్రజలు సంజయ్ పర్యటనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Also Read : తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు అందుకేనా?