తన సొంత నియోజకవర్గానికి వెళ్లనీయకుండా తనపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరుగుతున్నట్టు అనంతరం మీడియాకు ఎంపీ రఘురామరాజు వివరించారు. తన సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని, దాడులు చేస్తామని బెదిరించారని, ఇదే విషయాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టు ఎంపీ వెల్లడించారు. తనపై అన్యాయంగా ఏడు కేసులు బనాయించారని ఆయన గుర్తు చేశారు. తన ఫిర్యాదును కేంద్ర హోం మంత్రికి పంపిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని మీడియాకు తెలిపారు. రాష్ట్రపతి సూచనల మేరకు త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరిస్తానని రఘరామకృష్ణంరాజు చెప్పారు.
నాడు అలా…నేడు ఇలా…
కరోనా బూచి చూపించి స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డుకోవాలని చూసిన తమ పార్టీ నేతలు, ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఎంపీ గుర్తు చేశారు. ఏపీ సంక్షేమాన్ని, నిమ్మగడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మిగిలిన ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నేతలతో ప్రధానిని కలసేందుకు సమయం కోరానని ఆయన తెలిపారు.
Also Read:- రాత్రికి రాత్రి విశాఖకు లేచిపోవాలని జగన్ ప్లాన్.. ఎంపీ రఘురామరాజు











