భూములకు శాశ్వత హక్కు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రూపొందించిన భూమి హక్కు (ల్యాండ్ టైటిల్) బిల్లును కేంద్రం వెనక్కి పంపింది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర స్టాంప్ చట్టం1899లోని కీలకమైన అంశాలను ధిక్కరించేలా పలు అంశాలను చేర్చారనీ, దీన్ని యథాతథంగా ఆమోదించలేమనీ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశంపై తగిన వివరణ ఇస్తే తప్ప ఫైలును ఇతర శాఖల ఆమోదానికి పంపించలేమని ఏపీ సర్కారుకు తేల్చి చెప్పింది.ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం కొద్దిరోజుల క్రితం లేఖరాసింది.
ఈ లేఖపై ఏపీ సర్కారు నింపాదిగా స్పందించింది. కేంద్రానికి వివరణ ఇవ్వాలంటే రెవెన్యూశాఖనో, దాని పరిధిలోని సర్వే ఉన్నతాధికారుల ప్రతినిధులో ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశంతో ఏమాత్రం సంబంధం లేని వక్ఫ్‌బోర్డు సర్వే ఇన్‌చార్జి కమిషనర్‌ను, మరో జూనియర్ అధికారిని ప్రతినిధులుగా పంపించారు. 2019లో ఏపీ టైటిల్ బిల్లును రూపొందించిన ప్రభుత్వం.. అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. దీన్ని పరిశీలించిన కేంద్రం.. పలు అభ్యంతరాలు లేవనెత్తింది. కేంద్ర భూ సేకరణ చట్టం 2013, కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టం 1908, కేంద్ర స్టాంప్‌చట్టం 1899తో పాటు మరో రెండు చట్టాలను ధిక్కరించే అనేక క్లాజులు, అంశాలు బిల్లులో చేర్చారని కేంద్రం చెప్పింది. దీనిపై ఏపీ సర్కారు ఇచ్చిన వివరణకు కేంద్రం సంతృప్తి చెందలేదు. దీంతో.. బిల్లులో మార్పులు చేసి గత సంవత్సరం డిసెంబరు 4న మరోసారి అసెంబ్లీ ఆమెదంతో కేంద్రానికి పంపించింది. దీనిపైనా కేంద్రం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. వీటిని ప్రస్తావిస్తూ ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపించింది. దీనిపై వివరణ ఇవ్వడానికి వక్భ్‌బోర్డు సర్వే కమిషనర్‌ను పంపడంపై కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామంపై కేంద్ర ఆర్థికశాఖ అధికారులు ఏపీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. కీలకమైన బిల్లుపై వివరణలు ఇవ్వడానికి తమ వద్దకు ఓ డిప్యూటీ డైరెక్టర్ ర్యాంకు అధికారిని పంపించడం ఏమిటని మండిపడుతున్నారు.
Must Read ;- ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు











