ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పడకేశాయి. ప్రైవేటు ఆసుప్రతుల్లో ప్రభుత్వ ఖర్చుతో అందించే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన రూ.1800 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో కీలక ఆపరేషన్లు సైతం నిలిచిపోయాయి. రాష్ట్రంలోని దాదాపు 2 వేలకుపైగా ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. ప్రతి జిల్లాల్లో సగటున 250 ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాయి. గత ఏడాది కాలంగా ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు నిలిపిపోవడంతో వారు సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదు. కీలకమైన ఆపరేషన్లు సైతం చేసేందుకు వారు వెనకాడుతున్నారు. ఒక్కో హాస్పటల్ కు రెండు, మూడు కోట్లు బకాయిలు రావాల్సి ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రులు రోగులను చేర్చుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.
బిల్లుల చెల్లింపు అనుమానమే..
నేటికీ కొందరు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు. ఇంకా రూ.2000 కోట్ల నిధులు సమకూరితేగాని ఉద్యోగుల ఫించన్లు, జీతాలు అందే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకపోవడంతో శాఖల వారీగా జీతాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. దీంతో కొందరికి జీతాలు అందాయి. మరికొందరు జీతాల, ఫించన్ల కోసం వేచి చూస్తున్నారు. జీతాలు, ఫించన్లు పూర్తిగా చెల్లించేందుకే మరో వారం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేస్తారని భావించలేం. అందుకే ప్రైవేటు ఆసుపత్రులకు అధికారులు కూడా సరైన భరోసా ఇవ్వకపోవడంతో వారు సేవలు నిలిపివేశారు. ఎక్కడా అధికారికంగా సేవలు నిలిపివేశామని చెప్పకపోయినా, రోగులను చేర్చుకోవడం లేదు. అధికారికంగా సేవలు నిలిపివేస్తే పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతో ప్రైవేటు వైద్యశాలల యాజమాన్యాలు అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు.
స్పందించని ప్రభుత్వం..
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వంగానీ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులుగానీ, సంబంధిత మంత్రిగానీ ఎవరూ స్పందించలేదు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లింపులపై ఆలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరగా స్థానిక ఎన్నికలు పూర్తయితే, పురపాలకసంస్థలు, కార్పొరేషన్లల్లో పెంచిన పన్నులు అమల్లోకి తీసుకురావడంతోపాటు, రాష్ట్ర రోడ్లపై టోల్ గేట్లు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక ఆదాయ మార్గాలను అన్వేషించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ను సీఎం ఆదేశించారు. అంటే స్థానిక ఎన్నికల తరవాత మరోసారి పన్నుల బాదుడు తప్పేలా కనిపించడం లేదు. దీనికి తోడు లిక్కర్ మాల్స్ కూడా సిద్దం చేస్తున్నారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉండేలా మద్యం మాల్స్ ను తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే ప్రారంభించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆదాయం కన్నా అప్పులే ఎక్కువ..
ప్రతి నెలా ఏపీ ప్రభుత్వానికి వివిధ పన్నులు, లిక్కర్, ఇసుక అమ్మకాల ద్వారా రూ.9000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ ఖర్చు మాత్రం ప్రతి నెలా రూ.20 వేల కోట్లుగా ఉంది. ప్రతి నెలా ఏదో ఒక పథకం ద్వారా నగదు బదిలీ చేయాల్సి వస్తోంది. గత నెలలో రూ.6500 కోట్ల రూపాయలు అమ్మఒడికి అప్పులు చేసి మరీ చెల్లించారు. ఫిబ్రవరిలో రైతుభరోసాకు రూ.4500 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పులు పుట్టకపోవడంతో ఈ పథకం ద్వారా నగదు బదిలీ ప్రస్తుతానికి నిలిపివేశారు. అప్పు పుడితే వెంటనే రైతు భరోసాకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల ఫించన్లు, వృద్దాప్య, వింతంతు, దివ్యాంగుల ఫించన్లకే సరిపోతోంది. దీంతో బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వద్ద రూ.83000 కోట్ల బిల్లులు పెండిగ్ లో పడిపోయాయి. దీంతో కాంట్రాక్టులు దక్కించుకుని ఏపీలో పనులు చేసేందుకు కూడా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
Must Read ;- జగన్ పెద్ద డెకాయిట్.. గాలిమీద కూడా పన్నులు పిండేస్తాడు











