చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో భాగంగా ఆయనకు ఎదురైన అభిమానం మామూలుగా లేదు. తన కోసం వచ్చిన అభిమానులను చూసి చంద్రబాబు ఎమోషనల్ కూడా అయ్యారని సమాచారం. ఎందుకంటే తిరుపతి పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకి ఊహించని రీతిలో ఘన స్వాగతం లభించింది. అంతేకాదు, దారి పొడవునా వచ్చిన అభిమానులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్ షోలు, యాత్రల్లో కనిపించే స్థాయిలో జనం.. చంద్రబాబు వ్యక్తిగత పర్యటనకు వచ్చినప్పుడు రావడంతో ఆయన కళ్లలో నీళ్లు తిరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన బస ప్రదేశానికి వెళ్తుండగా దారి పొడవునా ఇదే జనం హడావుడి, అభిమానం కనిపించడం ఇక్కడ మరో ఆసక్తికరంగా మారింది.
రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి నగరానికి పది కిలో మీటర్ల దూరం కూడా ఉండదు. చంద్రబాబు కాన్వాయ్ 5 నిమిషాల్లో ఈ దూరాన్ని చేరుకోగలుగుతుంది. కానీ, గురువారం మాత్రం చంద్రబాబు రేణిగుంట నుంచి తిరుపతికి వెళ్లడానికి రెండు గంటల సమయం పట్టింది. దారి పొడవునా అభిమానులు టీడీపీ జెండాలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలకడంతో.. ఆ జనం తాకిడికి ఆయన కాన్వాయ్ ముందుకు కదల్లేదు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు కూడా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత విపరీతమైన స్థాయిలో జనాదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా చంద్రబాబు ఆలయాల సందర్శన కోసం తిరుపతికి వెళ్లారు. పార్టీ కార్యక్రమాల కోసం కాదు. దీనికే జన ప్రవాహం వరదలా కనిపించింది. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టించిందని, ప్రజలు ఇట్టే అర్థం చేసుకున్నారు. ఇప్పటికే అటు నారా లోకేశ్ యువగళానికి వస్తున్న ఆదరణ, ఇటు చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట.. ఆయనే ఊహించని రీతిలో జనం నీరాజనాలు పడుతుంటే.. వైఎస్ఆర్ సీపీ మాత్రం తాను చేసిన తప్పునకు పశ్చాపపడుతుందని తెలుస్తోంది.











