2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపినందుకు ప్రతిగా తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ రుణం తీర్చుకోవాలని సీఎం జగన్ భావించినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ అధికారం పదిలంగా ఉంటేనే ఏపీలో తమకు రాజకీయంగా కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కి సాయం చేశారనే వాదన వినిపిస్తోంది. ఆ సాయం నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితుల రూపంలో చేశారు. సరిగ్గా పోలింగ్ సమయానికి కొద్ది గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం పైన డ్రామా నడిపారు. ఆంధ్రా పోలీసులు 500 మంది వరకూ సాగర్ డ్యాం వద్దకు పంపి తమ ఆధీనంలో ఉన్న గేట్లను దౌర్జన్యంగా తెరుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ దౌర్జన్యంగా నీటిని తీసుకుపోతోందనే భావనను తెలంగాణ ప్రజల్లో కల్పించాలని పక్కా ప్లాన్ వేశారు. కానీ, అది జనాలకి తేలిగ్గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సాయం వల్ల కేసీఆర్ కి లబ్ధి కలగకపోగా కొంపముంచింది. సాయంత్రానికి విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలే దీన్ని స్పష్టం చేశాయి. తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్లుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఈ వ్యూహాన్ని ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకునే చేసినప్పటికీ, రచన, దర్శకత్వం మొత్తం తాడేపల్లి ప్యాలెస్ లోనే జరిగినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి 2019 ఏపీ ఎన్నికల సమయంలో తమకు బహిరంగ మద్దతు ఇచ్చి.. ఎంతో సహకరించిన కేసీఆర్ రుణం జగన్ తీర్చుకోలేకపోయారు. పైగా బీఆర్ఎస్ కు తాను నష్టం చేకూర్చినట్లుగా లోలోన జగన్ మథనపడుతున్నారట! సాగర్ ప్లాన్ బెడిసికొట్టడంతో సీఎం జగన్ కేసీఆర్ కొంపముంచినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఉన్నాయని అన్ని ప్రముఖ ఎగ్జిట్ పోల్ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క సంస్థ కూడా బీఆర్ఎస్.. మేజిక్ ఫిగర్ అయిన 60 సీట్లు దాటుతుందని చెప్పలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలాచాలా తక్కువని సర్వే సంస్థలు అంచనా వేశాయి.











