తప్పుడు ప్రచారం వల్లే అంచనాలకు నష్టం : దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ మంత్రి
వైఎసార్సీపీ చేసిన తప్పుడు ప్రచారం వల్లే పోలవరం అంచనాలకు నష్టం వాటిల్లింది. పోలవరం గురించి తెలిసీ తెలియని మూర్ఖత్వంలో ప్రభుత్వం ఉంది. డీపీఆర్2లో రూ.55,548 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని పోలవరం సైట్ కు వచ్చిన అప్పటి జలవనరుల మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం ఎలా అమలవుతుందో కూడా గడ్కరీ వెల్లడించారు. ఏడాదిన్నరగా ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రానికి లేఖ రాస్తామం టున్నందుకు సీఎం సిగ్గుపడాలి. టీడీపీ హయాంలో 71.02 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని వైఎసార్సీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. అప్పటి నుంచి ఒక్కశాతం పనుల్ని కూడా ముందుకు తీసుకెళ్లకపోగా ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు మేం బాధపడట్లేదు, ఓట్లేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. నిర్వాసితుల తరఫున పోరాట బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుంది. వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాం.
రూ.55 వేల కోట్లకు అనుమతులు ఇస్తేనే ప్రోజెక్టు పూర్తి : మంత్రి అనిల్ కుమార్
మేము పెట్టుకున్న లక్ష్యం లోపు పోలవరం పూర్తి చేయాలనే నిబద్దతతో ఉన్నాం. రూ.55 వేల కోట్లకు అనుమతులు ఇస్తేనే ప్రోజెక్టు పూర్తవుతుంది. ఖర్చు చేసిన రూ. 2200 కోట్లు ఇవ్వాలని కోరితే కేంద్ర ఆర్థిక శాఖ కొత్త అంశం లేవనెత్తింది. పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. కొన్ని సంవత్సరాలు పాటు జరిగే ప్రాజెక్ట్ నిర్మాణానికి అనేక సార్లు అంచనాలు పెరుగుతాయి. 2014 నుండి 2016 వరకు కేవలం రూ.265 కోట్ల పని మాత్రమే చేశారు. స్పెషల్ ప్యాకేజ్‌లో భాగంగా పోలవరం తీసుకొచ్చినట్టు టీడీపీ ఊదర కొట్టింది. 2014 వరకు ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. పోలవరం తామే తీసుకుని పని చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం కోరింది. 2017 మార్చిలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో అప్పగించాలని నిర్ణయించారు. అప్పుడే తాము 2014 తర్వాత లెక్కల ప్రకారం నిధులు ఇవ్వమని మెలిక పెట్టారు. ఆరోజు కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ నాయకులు కూడ ఉన్నారు. 2010 ప్రకారమే భూ సేకరణ ప్యాకేజ్ చెల్లిస్తాం అని చెప్పారు. 2014 అంచనాలు ఆమోదించి తమకు ఆ డబ్బులు ఇచ్చేయండి అని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. అప్పుడు ఒప్పుకుని 2018 తర్వాత చంద్రబాబు రచ్చ చేయడం మొదలుపెట్టారు. తప్పులు అన్ని టీడీపీ చేస్తే తాము క్షమాపణలు చెప్పాలా? పోలవరం కోసం 72 సార్లు వెళ్లాను అని చెపుతున్న చంద్రబాబు… కమిషన్ల కోసం త్వరగా పూర్తి చేయాలని పరిగెత్తారు. ఎవరు, ఎవరికి క్షమాపణ చెప్పాలో ప్రజలకు అర్థమైంది. పాత అంచనాలతో నిర్మాణం చేపట్టడానికి తాము సిద్ధంగా లేము. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది. మేము దానికోసం పోరాటం చేస్తాం. మా ఇరిగేషన్ అధికారులు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం జగన్ కేంద్ర పెద్దలకు లేఖలు రాస్తారు. లక్ష కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలి. ముందు సీడబ్ల్యూసీ ఇచ్చిన అంచనాలు ప్రకారం నిధులు చెల్లించాలని కోరుతాం. ప్రాజెక్ట్ కేంద్రం పూర్తి చేస్తుందా లేక రాష్ట్రమా అనేది తరవాత విషయం. వారంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం ఉంటుంది. అధికారులు ఆ సమావేశంలో పాల్గొంటారు. డ్యాం కట్టడం కన్నా నిర్వాసితుల లక్ష కుటుంబాలు ముఖ్యం.











