ఆయనో ఉత్తమ సర్పంచి!.. ఆ గ్రామానికి ఆయనే దిశానిర్దేశి. గతేడాది గణతంత్ర వేడుకల్లో అవార్డును సైతం సొంతం చేసుకుని ఆదర్శ సర్పంచి కూడా అయ్యారు. అయితే.. ఆయనలో అసలు బుద్దిమాత్రం అలాగే ఉంది. అది ఎట్టకేలకు బయట పడింది. ఓ పని నిమిత్తం రూ.20 లక్షలు ఇవ్వాలని వేధించడంతో అసలు విషయం బయటికొచ్చింది. ఇంతకీ ఆ సర్పంచి ఎవరు? ఆయన వేధించింది ఎందుకు? ఎవరిని?
ఉత్తమ సేవకుడి వక్రబుద్ధి!
వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ సర్పంచి ఉత్తమ సేవకుడిగా అవార్డు తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున అందరి కరతాల ధ్వనుల మధ్య ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. కానీ.. కొద్దినెలల్లోనే అతని వక్రబుద్ధి బయట పెట్టాడు. ఓ వ్యక్తి హెచ్‌ఎండీఏ నుంచి అన్ని అనుమతులు తీసుకుని దుకాణ సముదాయం నిర్మించుకుంటుండగా.. మామూళ్లు ఇవ్వాలని వేధించాడు. బాధితుడు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. రూ.13 లక్షలు తీసుకుంటూ.. ఏసీబీ వలకు చిక్కాడు.
దుకాణ సముదాయం.. భారీ లంచం!
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ ప్రధాన రోడ్డుపై ముజాహిద్ ఆలం ఖాన్‌కు 27 గుంటల భూమి ఉంది. అక్కడ దుకాణ సముదాయం కట్టుకునేందుకు ఆయన హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకున్నారు. నెల క్రితం పనులు ప్రారంభించారు. తనకు రూ. 20 లక్షలు ఇస్తేనే పనులు చేయనిస్తానంటూ గ్రామ సర్పంచి వినోద్‌గౌడ్ వేధిస్తూ పనులను అడ్డుకుంటున్నాడు.
కారులో నక్కి.. ఏసీబీ వలకు చిక్కి..
ఆ వేధింపులు భరించలేని బాధితుడు బేరమాడడం ప్రారంభించాడు. అంత ఇచ్చుకోలేమని ముజాహిద్ ఆలం ఖాన్ వద్ద పనిచేసే సాజిద్ పాషా బేరమాడగా, రూ. 13 లక్షలకు ఒప్పుకున్నాడు. శుక్రవారం ఉదయం ఫోన్ చేసి ఆ సొమ్ము బండ్లగూడలోని ఆరెమైసమ్మ వద్దకు తీసుకురావాలని సర్పంచి చెప్పాడు. ఆ మొత్తం గుడి వద్ద కారులో ఉన్న వినోద్‌కు అందించగా, ఏసీబీ అధికారుల బృందం పట్టుకుని సొమ్ము స్వాధీనం చేసుకుంది. శనివారం నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. గతంలో ఇంకేమైనా అక్రమాలకు పాల్పడ్డాడా? అసలు ఆ సర్పంచి ఆస్తులెంత? అవన్నీ ఎలా వచ్చాయనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
Must Read ;- అమ్మవారి నిధులు పక్కదారి.. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు