నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మీద స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో నితిన్ ప్రీ లుక్ ఇదే. దీనికి ‘చెక్’ అనే పేరును నిర్ణయించారు. చదరంగం ఆటలో వాడే పదం ఇది. మరి హీరో నితిన్ ఈ సినిమాలో ఎవరికి ‘చెక్’ చెప్పబోతున్నాడో చూడాలి. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ చేతుల మీదుగా ప్రీలుక్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీతిసింగ్ తో పాటు కన్నుకొట్టే భామ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

కన్నుకొట్టే భామకు తెలుగులో ఇది మొదటి సినిమా. గత ఏడాది ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. దాదాపు 80 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు జరిపే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది. ఇంతకుముందు భవ్య క్రియేషన్స్ నిర్మించిన ‘లౌక్యం’ సినిమాలో రకుల్ నటించింది. ఈ బ్యానర్ లో ఆమెకు ఇది రెండో సినిమా. హీరోగా నితిన్ కు ఇది 28వ సినిమా. భవ్య క్రియేషన్స్ కు ఇది 12వ సినిమా. కరోనా పరిస్థితులు లేకుంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది.

ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలన్నీ ప్రత్యేకత కలిగి ఉంటాయి. అనవసర కమర్షియల్ అంశాల జోలికి ఆయన వెళ్లడు. కథ, కథనాల మీదనే ప్రత్యేక దృష్టిపెడుతుంటాడు. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అలాంటి రూమర్లకు చెక్ చెబుతూ ఈరోజు నితిన్ ప్రీ లుక్ ను తెరమీదకు తెచ్చారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇదని చెప్పారు. ఇందులో నితిన్ అద్భుతంగా నటించాడని అన్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశ లో ఉందని చెప్పారు.











