టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఇదేదో టీడీపీ కేడరో, లేదంటే…చంద్రబాబు అంటే అభిమానం ఉన్నవారో చెప్పే మాట కాదు. చంద్రబాబు రాజకీయ వ్యూహాలను పరిశీలించే వారు ఎవరైనా ఈ మాటను ఒప్పుకుని తీరాల్సిందే. ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలను వేనోళ్ల కొనియాడాల్సిందే. నిజమే… 45 ఏళ్లకు పైబడి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు… ఏనాడూ తన అస్థిత్వాన్న కోల్పోయే దిశగా అడుగులు వేయలేదు. వరుసబెట్టి రెండు సార్లు సీఎం అయితేనే జాతీయ రాజకీయాల్లోకి వేళ్లతో పాటు కాళ్లు పెట్టి… కాళ్లతో పాటు మూతులు కాల్చుకున్న నేతలు ఉన్న ప్రస్తుత తరుణంలో… చంద్రబాబు ఏనాడూ తన రాష్ట్రాన్ని విడిచిపెట్టలేదు.
అలాగని జాతీయ స్థాయిలో ఏ మేర రాజకీయం చేయాలో ఆ మేరకు మాత్రమే తన వ్యూహాలను అమలు చేశారు. జాతీయ స్థాయి నేతల నుంచి కూడా చంద్రబాబు గౌరవ మర్యాదలను పొందుతున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోదీ అయినా…ఆయన తర్వాతి స్థానంలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అయినా… చంద్రబాబుకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలే కారణమని చెప్పక తప్పదు.
పదేళ్లకు పైగా దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోదీ సర్కారుపై ఇప్పటిదాకా పెద్దగా వ్యతిరేకత వచ్చిన దాఖలానే లేదని చెప్పాలి. ఇక అధికార పక్షాన్ని నిలదీసే విపక్షాలు కూడా ఈ పదేళ్లలో మోదీ సర్కారును పెద్దగా ఇబ్బంది పెట్టిన దాఖలానే లేదు. మోదీ అండ్ గ్యాంగ్ అనుసరిస్తున్న వ్యూహాలను కాచుకోవడం, వాటి నుంచి తమను తాము కాపాడుకోవడం వంటి ఆత్మరక్షణ చర్యలకు మాత్రమే విపక్షాలు పరిమితమయ్యాయి. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు వేదికగా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా విపక్షాలన్నీ మోదీ అండ్ కోపై ముప్పేట దాడిని మొదలెట్టాయి.
ఫలితంగా గడచిన రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సహా… దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ విపక్షాలన్నీ బీజేపీ అండ్ కోపై విరుచుకుపడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న విపక్షాలు… అందుకు అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయనను మోదీ తన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని నినదిస్తున్నాయి. ఈ పరిస్థితి నిజంగానే మోదీ అండ్ కోకు పెను సమస్యగానే పరిణమించింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఓ పరిణతి కలిగిన నేతగా పేరున్న చంద్రబాబు నుంచి మద్దతు దక్కితే ఎలా ఉంటుంది? వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టే ఉంటుంది. ప్రత్యర్థులు ఎంత బలంగా ఉన్నా కూడా… వారిని ఈజీగానే ఓడించి తీరతామన్న నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు కూడా మోదీ సర్కారుకు అలాంటి భరోసానే లభించింది. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ షాకు చంద్రబాబు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని విపక్షాలు భూతద్దంలో చూపించే యత్నం చేస్తున్నాయన్న చంద్రబాబు… బాధ్యత కలిగిన విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేయడానికి తాను వ్యతిరేకమని తన వైఖరిని కుంబబద్దలు కొట్టేశారు. ఈ తరహా రాజకీయాలను ఏ ఒక్కరు స్వాగతించరాదని కూడా ఆయన పిలుపునిచ్చారు.
ఓ వైపు ఈ అంశాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఏలో చీలికలకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లాంటి నేతలు యత్నిస్తున్న తరుణంలో చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నేత నుంచి మద్దతు లభించడంతో మోదీ, షా ద్వయం ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. అంతేకాకుండా విపక్షాలు అనవసరంగా సాగిస్తున్న రాద్ధాంతాన్ని కట్టడి చేసే దిశగా ఆలోొచన చేసేందుకు తమకు చంద్రబాబు లాంటి నేతల మద్దతు ఎంతగానో ఉపకరిస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా కీలక తరుణంలో చంద్రబాబు మద్దతుతో మోదీ, షాలు ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం.











