ప్రపంచంలోనే అత్యున్నత న్యాయవ్యవస్థ భారత్ సొంతం. అనేక సంక్షోభాల్లో న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలిచింది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు పనిగట్టుకుని న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. ఏదైనా కోర్టు తీర్పు నచ్చనివారు పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే తీర్పులు తమకు వ్యతిరేకంగా వస్తున్నాయనే కారణంతో కొందరు వ్యక్తులు న్యాయ క్రూరత్వం పేరుతో న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను తప్పుపడుతున్నారు. అయినా న్యాయమూర్తులు ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు. తమ పనితీరుతోనే ఇలాంటి విమర్శకులకు సమాధానం చెప్పాలని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. ఎవరు ఎంత రెచ్చిపోయినా తాను ఎక్కడా సహనం కోల్పోకుండా వ్యవహరిస్తున్న న్యాయమూర్తి హాదాకు జస్టిస్ రమణ రాజ్యాంగ విలువల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఖర్చులు తగ్గాలి..
మనదేశంలో పేదవారు కోర్టు మెట్లు ఎక్కాలంటే భయపడే పరిస్థితి ఉంది. లాయర్లు ఫీజుల రూపంలో ఎంత డిమాండ్ చేస్తారో చెప్పలేం. న్యాయవాదులకు ఉండే డిమాండ్ ను బట్టి కేసు ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే పేదవారు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించలేకపోవడంతో, అలాంటి వారికి నేటికీ న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే కొన్ని కేసులు ఉచితంగా వాదించాలని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. 22 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన కోవింద్ చాలా కేసులు ఉచితంగా వాదించారు. ఎంతో మంది పేదలకు న్యాయసేవ చేశారు. అలాగే ప్రతిన్యాయవాది కొందరికి ఉచితంగా న్యాయసేవ అందించాలని రాష్ట్రపతి కోరడం అభినందనీయం.
కోర్టు తీర్పులను గౌరవించాలి
దేశంలో కోర్టు తీర్పులకు గౌరవం లేకపోతే అరాచకం రాజ్యం ఏలే ప్రమాదం ఉంది. మున్సిఫ్ కోర్టుల నుంచి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం వరకు ఎవరైనా న్యాయసేవలు పొందవచ్చు. ఏదైనా కోర్టులో తీర్పు నచ్చకపోతే ఆపైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అంతేకాని కోర్టు తీర్పు నచ్చలేదని న్యాయమూర్తులను తప్పుపడితే, ఇక న్యాయవ్యవస్థపై ఈ సమాజంలో గౌరవం ఎలా పెరుగుతుంది. తీర్పులను గౌరవించనప్పుడు ఇక కోర్టులు ఎందుకు. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూడో స్థంభంగా ఉన్న న్యాయవ్యవస్థ మనుగడకు రాజ్యాంగం అనేక రక్షణ కవచాలను ఏర్పాటు చేసింది. కోర్టు తీర్పులపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లే సదుపాయాన్ని రాజ్యాంగం అందరికీ కల్పించింది.
Must Read ;- జస్టిస్ రమణపై విషం: మోసగాడు, జైలుపక్షే దొరికాడా?
సంస్కరణలు చాలా కీలకం
దేశంలో ఆర్థిక సంస్కరణల తరవాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అందివచ్చిన సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకోవడంలో న్యాయవ్యవస్థ కొంత వెనుకబడిందనే చెప్పాలి. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సులు, కేసుల ఆన్ లైన్ ఫైలింగ్ చేస్తున్నా న్యాయవ్యవస్థ పేదలకు దరిచేరలేదనే చెప్పాలి. ప్రాంతీయ భాషల్లో వాదనలు, తీర్పులు, రోజువారీ వ్యవహారాలు నడవాలి. కోర్టుల్లో ఏం జరుగుతుందో పేదవాడికి నేటికీ అర్థంకాని బ్రహ్మపదార్థంలా న్యాయవ్యవస్థను తయారు చేశారు. ఎవరికి అన్యాయం జరిగినా ధైర్యంగా కోర్టు మెట్లు ఎక్కగలిగిననాడే భారత న్యాయవ్యవస్థ ప్రజల మన్ననలు అందుకుంటుంది.
ఓడిన వారు కోర్టులో, గెలిచిన వారు ఇంటికొచ్చి
మన దేశంలో పలు కోర్టుల్లో 3 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండటం న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించాల్సి వస్తోంది. అన్నీ రంగాల్లో సంస్కరణలు వచ్చినా న్యాయవ్యవస్థలో మాత్రం ఇంకా చాలా మార్పులు చేయాల్సి ఉంది. చిన్నచిన్న కేసులు కూడా రెండు దశాబ్దాలు వాదిస్తే ఇక బాధితులకు న్యాయం జరిగేది ఎప్పుడు. వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్షపడకూడదు అనే న్యాయ సూత్రం వినడానికి బాగానే ఉన్నా, న్యాయం కోసం కోట్లాది మంది ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే, వారందరినీ అన్యాయం చేస్తున్నట్టే లెక్క. సకాలంలో న్యాయం అందించలేకపోతే అది అన్యాయం కిందకే వస్తుందనడంలో సందేహం లేదు. ఏ కేసును ఎన్ని రోజుల్లో ముగించాలనే గడువు విధించాలి. ఒక్కోకేసు ఒక్కో కోర్టులో పదేళ్లు నానబెడితే నాలుగు కోర్టుల్లో తేలడానికి నాలుగు దశాబ్దాలు పడుతుంది. దేశంలో పేరుకు పోయిన లక్షలాది కేసుల సత్వర పరిష్కారానికి కొన్ని నింబధనలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్ద కేసు అయినా రెండు సంవత్సరాల్లో అన్ని కోర్టులను దాటుకుని తుది తీర్పు వచ్చేలా చట్టం చేయాలి. ఒక్కో కోర్టులో ఆరు నెలలకు మించి కేసుపై వాదనలు జరగడానికి వీల్లేదనే నిబంధనలు అమలు చేయాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరగుతుంది. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు న్యాయవ్యవస్థకు కావాల్సిన సిబ్బందిని, మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సిన అవసరం ఉంది. సత్వరం న్యాయం జరిగినప్పుడే ప్రజలకు కోర్టులపై గౌరవం పెరుగుతుంది. లేదంటే కోర్టు కేసుల్లో బాధితులే బలైపోయే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read ;- ‘జగన్ భ్రమల్లో ఉన్నారు..’ : సుప్రీం సీజేకు మాజీ న్యాయమూర్తి లేఖ











