ప్రతి 50 ఇళ్లకు ఇక వాలంటీరును నియమించి ప్రతి ప్రభుత్వ పథకాన్ని డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు వాలంటీర్లకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే 20 నెలలుగా వాలంటీర్లతో ప్రభుత్వం అన్నీ పనులు చేయిస్తోంది. ఒకటో తేదీ ఫించను పంపిణీ నుంచి రేషన్ పంపిణీ వరకూ ప్రతి పనిలో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకుంటోంది. అయితే కేవలం రూ.5 వేలతో తాము బతకలేమని కనీసం రూ.12 వేలకు జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ వాలంటీర్లు ఆందోళన బాట పడ్డారు. దీనిపై సీఎం స్పందించారు. వాలంటీర్ అంటేనే సేవకుడు అని, సేవ చేయడమే వాలంటీర్ ఉద్దేశంగా ఉండాలని ఆయన హితవు పలికారు. దీంతో వాలంటీర్లు అయోమయంలో పడిపోయారు.
రాజీనామాలకు సిద్దమవుతున్న వాలంటీర్లు..
అనేక మంది యువత డిగ్రీలు, పీజీలు చేసి వాలంటీర్లుగా చేరారు. అయితే ఇందులో ఎదుగుదల ఉంటుందని భావించారు. కానీ వాలంటీరుకు రూ.5 వేలకు మంచి ఇచ్చేది లేదని సీఎం స్పష్టంగా ప్రకటించడంతో ఇక వారంతా వాలంటీర్ పనికి స్వస్థి పలికే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే గడచిన 20 నెలల్లో 12 వేల మంది వాలంటీర్లు తమ ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా సీఎం నిర్ణయంతో వేలాది మంది వాలంటీరు ఉద్యోగాలను వదిలేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాలపాటు వాలంటీరుగా పని చేస్తే ఆ తరవాత ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పనికిరాకుండా పోతామని వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వాలంటీర్లు తమ ఉద్యోగం వదిలేసి కొత్తవి వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం కనీస వేతనం కింద రూ.12 వేలు ఇస్తుందన్న ఆశ కూడా చావడంతో ఇక వాలంటీర్లు వలసబాట పట్టారు.
వాలంటీర్లకు జీతాలు పెంచే ఆలోచనలు లేదు..
వాలంటీర్లు ఎంత ఆందోళన చేసినా జీతం పెంచే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇప్పటికే 2.5 లక్షల వాలంటీర్లకు ఏటా రూ.1800 కోట్లు ఖర్చవుతోంది. వీరికి నెలకు రూ.12 వేలు ఇవ్వాలంటే ఇక ప్రభుత్వంపై రూ.4000 కోట్ల భారం పడనుంది. ఇప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏటా రూ.4000 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దంగా లేదు. అందుకే వారికి వాలంటీర్ అనే ట్యాగ్ తగిలించి ఉచితంగా సేవలు పొందాలని చూసింది. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో కనీసం రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అదే వాలంటీర్లు మాకు కనీసం రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, వైసీపీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన వ్యవస్థే పెనుభారంగా తయారయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పందించారు. వాలంటీరు అంటే సేవలకుడు అటూ సుదీర్ఘ లేఖ రాశారు. సేవ చేయడం ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పుకొచ్చారు. దీంతో వాలంటీర్ల జీతాలు పెంచే అవకాశం లేదని తేలిపోయింది.
అడ్డంతిరుగుతున్న వాలంటీర్లు..
వాలంటీర్ ఉద్యోగాల్లో 95 శాతం వైసీపీ వారికే ఇచ్చామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు బహిరంగంగానే ప్రకటించారు. వాలంటీర్ అంటే అదో పెద్ద ఉద్యోగం అన్న బిల్డప్ ఇచ్చారు. దీంతో గ్రామాల్లో ఉన్నత విద్యనభ్యసించిన వారు కూడా ఎగబడి వాలంటీరుగా చేరారు. తీరా 20 నెలలు పనిచేసినాక తెలిసివచ్చింది. వాలంటీర్ల సేవలను వాడుకుని వదిలేస్తారని అర్థమైంది. దీంతో జీవితంపై వాలంటీర్లకు బెంగ ఏర్పడింది. రూ.5 వేలతో కుటుంబం నడిపేది ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో వారు ఉద్యోగాల వేటలో పడ్డారు. చాలా మంది వాలంటీర్లు డిగ్రీలు చదివి ఉండటంతో వారంతా ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాల కోసం హైదరాబాద్ బాట పడుతున్నారు. దీంతో వాలంటీరు పోస్టులు ఖాళీ అయిపోతున్నాయి. వాలంటీర్లు పార్టీకి అండగా నిలుస్తారని వచ్చే ఎన్నికల నాటికి ఒక్కో వాలంటీర్ వైసీపీకి భారీగా ఓట్లు వేయిస్తాడని భావించిన ఆ పార్టీ పెద్దలకు వాలంటీర్ల వలసలతో షాక్ తగిలింది. అందుకే వాలంటీర్ జీతాలపై ఏ ఒక్క వైసీపీ నేత కూడా నోరు తెరవడం లేదని తెలుస్తోంది. ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారని భావించారో వారే తిరగుబాటు చేయడంతో వైసీపీ పెద్దలు ఈ వ్యవస్థపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.











