కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో సాగునీరు ఇవ్వాలని సూచించారు. తొలుత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించారు. కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం కన్నెపల్లి బ్యారేజీని, మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఈ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా 85 గేట్లు ఉన్నాయి. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో లపై కేసీఆర్ మాట్లడారు. వేసవిలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగు నీరిచ్చేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, సమీక్షలో మాట్లాడదామని సూచించారు. ప్రాణహిత, గోదావరి సంగమ స్థలమైన పుష్కర ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన పరిస్థితులపై అక్కడి అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. రివర్స్ పంపింగ్ ద్వారా ప్రస్తుతం మేడిగడ్డలో 99 అడుగులు, 16 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారులు చెప్పారు. దాదాపు 5 నెలల తరువాత ఎత్తిపోతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయగలిగే మోటార్ల ఏర్పాటు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ బ్యారేజీని రూపొందించారు.
ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్
ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులతో మాట్లాడుతూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. ఇతర ప్రాజెక్టులు వేగవంతం చేయాలని సూచించారు. నిరాటంకంగా నీరు పంపింగ్ చేయాలని, ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ రూల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రానున్న కాలంలో ప్రతి నెలకు ఓసారి సమీక్ష ఉంటుందని, త్వరలోనే దీనిపై సూచనలు వస్తాయని చెప్పినట్లు సమాచారం.
ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 లక్షల 25 వేల ఎకరాలకు కొత్తగా నీరు, కోటి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉంటుందని, కాల్వల పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో మొత్తం రివ్యూ చేయనున్నారు. పాత ఆయకట్టు పరిధిలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టుల పరిధిలో వేసవిలో సాగునీటి సరఫరా, అనుసంధాన కాలువలు, సొరంగాలు, పంపు హౌజ్‌లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, అసిఫాబాద్, మంచిర్యాల నియోజవకర్గాల పరిధిలోని కొత్త ప్రాజెక్టులకు కూడా క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో..వీటిపైనా కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.
కాళేశ్వరం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు హెలీపాడ్ వద్ద మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు స్వాగతం పలికారు. దాదాపు ఏడాది క్రితం కాళేశ్వరంపై సమీక్ష నిర్వహించారు కేసీఆర్. తరువాతి కాలంలో అధికారులతో మాట్లాడుతున్నారు. ఏడాది తరువాత సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించారు. కాగా, ఈ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Must Read ;- జగన్ నిర్ణయానికి కేసీఆర్ చెక్!











