“కేసీఆర్‌లో వేంకటేశ్వర స్వామిని చూసుకుంటా... పల్లకిలో మోస్తా.. దోమాల సేవ చేస్తా…” ఇవి ఏ టీఆర్ఎస్ భక్తుడో అన్న మాటలు కావు. అవకాశం దొరికినప్పుడల్లా సీఎంపై మాటల తూటాలు ఎక్కుపెట్టే.. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. ఈ విషయం నమ్మటం కష్టమే! కానీ.. నిజంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలే! ఆదివారం భాగ్యనగరంలో జరిగిన కమల దళం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వేదికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్.. తదితర పెద్దల సమక్షంలోనే ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకీ ఎప్పుడూ మాటలతోనే పోస్టుమార్టం చేసే బండి సంజయ్.. కేసీఆర్‌ను ఎందుకు పల్లకిలో మోస్తానన్నారు? ఎందుకు దోమాల సేవ చేస్తానన్నారు?
తొమ్మిది నెలల తర్వాత తొలి భేటీ
సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ అయ్యింది. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన 9 నెలల తర్వాత జరిగిన తొలి రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఇదే. పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు సంజయ్ ఆవేశంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని.. నేటి కేసీఆర్ పాలన వరకూ కూలంకషంగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ప్రసంగంలో తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నారు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ.. కేసీఆర్‌పై సెటైర్లు విసురుతూ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
గోల్కొండ కోటపై కాషాయ జెండా…
ఒకప్పటితో పోల్చుకుంటే ప్రజల్లో ఆలోచనా శక్తి పెరిగిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనే కాదు.. మొత్తం దేశమంతా ఏం జరుగుతోందో గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలకు నరేంద్ర మోడీ, కమలం పువ్వు గుర్తే కనిపిస్తోందని స్పష్టం చేశారు. అందుకే.. నలుగురు ఎంపీలను, దుబ్బాక ఉప ఎన్నికతోపాటు జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ లను గెలిపించి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమేనని జోష్యం చేప్పారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగుర వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.
కోటి ఆశలతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ స్వలాభం కోసం శ్మశానంగా మారుస్తున్నడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యువకులను గాలికొదిలేసిండు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించామని టీఆర్ఎస్ సర్కారు అసత్య ప్రచారం చేస్తోంది. 13,500 కంపెనీలను తెలంగాణకు తెచ్చినమని అబద్దాలు చెబుతోంది. ఉద్యోగ కల్పనపై గులాబీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే.. సీఎం కేసీఆర్‌లో వేంకటేశ్వర స్వామిని చూసుకుంటా.. ఆయనను పల్లకిలో కూర్చోబెట్టుకుని మోస్త.. దోమాల సేవ చేస్తా.. అదే లేకుంటే పాడె కడతం. తెలంగాణ తల్లికి కేసీఆర్ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తం.
– బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Must Read ;- తిరుపతికి పవన్.. బీజేపీకి బీపీ పెరిగినట్టేనా?