తెలంగాణలో బ్యూరోక్రాట్ల మధ్య అంతర్గత పోరు మొదలైంది. బీహారీ వర్సెస్ నాన్ బీహారీగా ఒక అప్రకటిత సమరం సాగుతోందా.. అంటే సచివాలయ వర్గాలు అవుననే అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలన పరమైన నిర్ణయాలకు ప్రజల నుండి ఎందుకు వ్యతిరేకత వ్యక్తం అవుతోంది? ప్రభుత్వం తాను గతంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు వెనక్కి ఎందుకు తీసుకోవడంలో కూడా ఇదే కారణమని సచివాలయ వర్గాలు.
పాలన పరమైన నిర్ణయాలు తీసుకునే ముఖ్యమైన అధికారి ఇలాంటి స్కీంలు పెడుతున్నది ఎందుకోసం అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలకు మంచి నిర్ణయాలతో దగ్గరవ్వాల్సిన ప్రభుత్వం రోజురోజుకు ప్రజలకు దూరం ఎందుకు అవుతోందంటే ఆ అధికారి అసమంజస నిర్ణయాలే ప్రధాన కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బీహార్ వర్సెస్ నాన్ బీహార్
తెలంగాణ బ్యూరోక్రాట్లలో బీహారీలదే పైచేయి ఉంటుంది. సీనియర్ ఐఏఎస్‌లలో చాలా మంది ఆ రాష్ట్రం వారు తెలుగు రాష్ట్రాలను ఆప్షన్‌గా ఎంచుకుంటుంటారు. దక్షిణాది నుండి గతంలో ఐఏఎస్ లు అయిన వారు చాలా తక్కువ. ఉన్న ఒక్కరో ఇద్దరో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే వారే. కారణాలు ఏమైనా.. బీహార్ నుండి వచ్చిన వారు తెలంగాణలో అనేక ఉన్నత పదవుల్లో, కీలక శాఖల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వారి ప్రమేయం కచ్చితంగా ఉంటుంది.
టీఆర్ఎస్ సర్కార్ మొదటి సారి సర్కార్ ఏర్పాటు చేసిన తరువాత అనేక స్కీం లను ప్రకటించింది. ప్రాజెక్టులను కూడా తన అనుకున్న రీతిలో డిజైన్ చేయించుకుని నిర్మించింది. ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. ఇందులో రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్ట్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా అనేక పథకాలు ప్రజల్లో ప్రభుత్వం ప్రతిష్టను పెంచాయి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ఏ పథకం ప్రకటించినా.. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందుకు కారణం బీహారీ ఐఏఎస్ లే అన్న అనుమానం ప్రభుత్వ వర్గాల నుండి వస్తోంది.
ఐఏఎస్‌లలో చిచ్చురేపిన బీజేపీ…
ఒక్కసారిగా బ్యూరోక్రాట్ల మధ్య వాతావరణం ఇలా మారిపోవడానికి కారణం బీజేపీ అంతర్గతంగా చేసిన ఆపరేషన్ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా వచ్చిన సీనియర్ నేత నెరపిన మంత్రాంగం ఇందుకు కారణం అని చర్చ సాగుతోంది. ఆయన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల స్ట్రాటజీకోసమే వచ్చినా ఆయన దీర్కాలిక ప్లాన్ తోనే వచ్చారని చర్చసాగుతోంది. బీజేపీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా నడిపించేందుకు స్ట్రాటజీ వర్కౌట్ చేసి వెళ్ళారని టీఆర్ఎస్ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడం ద్వారా ఆ పార్టీ నుండి ప్రజలను దూరం చేసేందుకు చేసిన ప్లాన్ లో భాగంగా బ్యూరోక్రాట్లను కూడా తనవైపు తిప్పుకునేందుకు ఆనేత వేసిన ప్లాన్ ప్రస్తుతం అమలవుతోందంటున్నారు
టీఆర్ఎస్ నేతలు. యాదృచ్ఛికమో కావాలనే ఇలా జరుగుతుందో తెలియదు కాని ప్రజలకు మంచి చేయబోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.
వరద సాయంతో టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యేది పోయి కోట్ల రూపాయాలు ఖర్చుచేసినప్పటికీ డ్యామేజీ తప్పలేదు. రైతుచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది.. రిజిస్ట్రేషన్ లు పాత పద్ధతిలోనే జ రుగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్‌లో ఉంటూ ప్రభుత్వం పాలసీలు సిద్ధం చేసే బ్యూరోక్రాట్లు బీజేపీ వలలో పడటంవల్లనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి బ్యూరోక్రాట్ల మధ్య చీలిక- ప్రభుత్వం ప్రతిష్టను ఇంకా ఏ మేరకు దిగజారుస్తుంది.. కేసీఆర్ మేల్కొని నష్ట నివారణ ఎలా చేస్తారన్నది చూడాలి.