ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయో ఆయన మ్యాపులతో మీడియాకు వివరించారు. కాంగ్రెస్ పాలనలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఇవాళ కేంద్రంలోని బీజేపీ పెద్దలు పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఖర్చులు మాత్రమే భరిస్తామని చెప్పడం ఏపీ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి లేదని ఆయన వివరించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై రూ.18 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.2 వేల కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తోందని ఉండవల్లి విమర్శించారు.
పునరావాసమే అసలు సిసలు సవాల్
పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ కాంపోనెంట్‌కు రూ.20 వేల కోట్లు ఖర్చు అయితే, పునరావాసం, పరిహారానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం, కేవలం ప్రాజెక్టు ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు మాత్రమే ఇచ్చి తప్పించుకోవాలని చూడటం దారుణమని, దీనిపై ఏపీ సీఎం నోరు మెదపకపోవడం మరింత దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పరిహారం, పునరావాసం నిధులు కేంద్రం ఇవ్వకుంటే ఏపీ ప్రభుత్వం వల్ల కాదని ఆయన హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించి వదిలేయడం వల్ల ఉపయోగం లేదని, పూర్తిగా పునరావాసం, పరిహారం చెల్లించి ప్రాజెక్టులో 196 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే ప్రయోజనం దక్కుతుందన్నారు.
Must Read ;- ఉండవల్లితో రాయబారమా.. రాజ‘బేరమా’
తెలంగాణ ప్రాజెక్టులపై ఉండవల్లి ఆందోళన
ఇప్పటికే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తి పోస్తున్నారని, దేవాదుల ప్రాజెక్టు, సీతారామ ఎత్తిపోతల ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేసుకుంటే గోదావరిలో నవంబరు నుంచి చుక్క నీరు ఉండదని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నది నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నా నదిలో నాలుగు నెలలు మాత్రమే వరద ఉంటుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ సీఎం తెలివిగా ఎత్తిపోతల పథకాలతో పాటు అనేక రిజర్వాయర్లు నిర్మించి 200 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం సాధించారని గుర్తు చేశారు.
పోలవరాన్ని బ్యారేజీగా మార్చి చారిత్రాత్మక తప్పిదం చేయవద్దు
పోలవరం ప్రాజెక్టును 45 మీటర్ల వరకు నిర్మించినా, కేవలం 36 మీటర్ల వరకే నీటిని నిల్వ చేసి కాలువలకు నీరివ్వాలని ఏపీ సీఎం భావిస్తున్నారని,ఇంతకన్నా దారుణం మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయకపోతే రబీ సాగుకు నీరు సరఫరా సాధ్యం కాదని ఆయన వివరించారు. నవంబరు తరవాత గోదావరిలో వరద నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోతుంది. తెలంగాణలో అనేక ఎత్తిపోతల పథకాలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయకుండా కుడి కాలువపై మరో ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ సీఎం భావిస్తున్నారని, ఇదే జరిగితే ఇంతకన్నా చారిత్రాత్మక తప్పిదం మరొకటి ఉండదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంగుళం కూడా ఎత్తుతగ్గదని చెబుతున్నారు, కానీ పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని సీఎం హామీ ఇవ్వకపోవడం శోచనీయమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
Must Read ;- ఆ ఐదు మండలాలు కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తారా?