‘నడి సంద్రం’లో రాహుల్ గాంధీ..! ఇది వినగానే రాహుల్ గాంధీకి ఏమైంది కంగారు పడకండి.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈత కొట్టడమంటే మహా సరదా! కానీ, ఆ సరదా తీర్చుకోవడానికి ఇంతకాలం ఆయనకు స్విమ్మింగ్ పూలే దిక్కవుతోంది. అలా సరదాగా.. బహిరంగ ప్రదేశంలో.. స్నేహితులతో కలిసి.. సహజ నీటి వనరుల్లో.. ఈత కొడుతూ ఉంటే.. ఆ మజానే వేరు. రాహుల్ కి కూడా ఇదే కోరిక. అవకాశం లేక.. ఇన్నేళ్లు దాన్ని అలాగే దాచుకున్నారు పాపం. ఇంతకాలానికి ఇప్పుడు చిక్కింది ఆ అద్భుత అవకాశం. రాకరాక వచ్చిన ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నారు రాహుల్. గబుక్కున నడి సంద్రంలో దూకేసి.. అలా అలా ఈత సరదా తీర్చేసుకున్నారు.
కేరళలో పర్యటన
ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కొల్లాం జిల్లాలో మత్సకారులతో మమేకమైపోయారు. బుధవారం వారితో కలిసి బోట్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు. అలా నడిసంద్రంలో ప్రశాంతంగా ఉన్న నీటిని చూసేసరికి ఆయన మనసాగలేదు. గబుక్కున సముద్రంలో దూకేశారు. దీంతో.. భద్రతా సిబ్బంది సహా మత్సకారులు కూడా కంగారు పడిపోయారు. కానీ, రాహుల్ మాత్రం ప్రశాంతంగా ఈత కొట్టారు. దీంతో.. అక్కడున్న మత్సకారులు కూడా సముద్రంలో దూకారు. వారితో కలిసి రాహుల్.. అలా సరదాగా ఈత కొట్టారు. సముద్రపు నీటిలో జలకాలాటలు ఆడారు. అలా.. దాదాపు 10 నిముషాలు మత్సకారులతో కలిసి ఈత కొట్టారు. మొత్తంగా గంట సేపు సముద్రంలో సరదాగా గడిపారు. తమతో కలిసి రాహుల్ గాంధీ ఈత కొట్టడంతో.. ఆ మత్సకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం బోటెక్కి ఒడ్డుకు చేరుకున్న రాహుల్.. ఈ రోజుతో తన చిరకాల స్వప్నం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Must Read ;- రాహుల్‌ను రుద్దడానికి సోనియా కొత్త వ్యూహమా?