అన్నాడీఎంకే తాను వేరు కాదంటున్న చిన్నమ్మ ఆ పార్టీనే చేపట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాట చిన్నమ్మగా పిలుచుకునే శశికళ జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు సంది జపం పటిస్తూనే..మరోవైపు పార్టీకే ఎసరు పెట్టే కార్యక్రమం అమలవుతోంది. ఇక జయలలిత జయంతి సందర్భంగా చెన్నైలో జయలలితకు నివాళులు అర్పించేందుకు శశికళ నివాసానికి పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. వీరిలో దర్శకుడు భారతీ రాజా, నటులు రాధిక,శరత్ కుమార్ శశికళ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ అమ్మ స్థాపించిన పార్టీ అందరిదీ అని.. ఆ పార్టీని అందరం కలసి కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృత వేటు ఎదుర్కొంటున్న శశికళ చేసిన వ్యాఖ్యలు పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. అన్నాడీఎంకే పార్టీ, తాను వేరు కాదని, తనది అన్నాడీఎంకే పార్టీయేనని సంకేతాలు ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అమ్మ కోరుకున్నట్టు పార్టీ కేడర్ అంతా ఏకమై కలసిరావాలని, మరో 100 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయడమే మన లక్ష్యమని వ్యాఖ్యానించారు. కాగా తనకు తానుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నారు శశికళ.
నిరాశలోనే..ఆశావాది..
కాగా జైలు నుంచి విడుదలై శశికళ 23గంటల పాటు భారీ ర్యాలీగా బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చారు. కారుపై అన్నాడీఎంకే జెండా పెట్టుకుని చిన్నమ్మ చేసిన ర్యాలీలో ఆమెకు అభిమానులు నీరాజనాలు పట్టారు. అయితే తమిళనాడులో శశికళ ఊహించినంత పరిణామాలు చోటుచేసుకోలేదు. తాను వచ్చాక అన్నాడీఎంకేలో చీలిక వస్తుందని, అప్పుడు తమది పై చేయి అవుతుందని భావించారని తెలుస్తోంది. అయితే కేవలం కొంతమంది నేతలే వచ్చి ప్రత్యక్షంగా కలిశారు. మిగతావారు సందేశాలు పంపారు. ఈ పరిస్థితుల్లో తన మేనల్లుడు దినకరన్ స్థాపించిన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో కలిస్తే అన్నాడీఎంకే నుంచి మరింత దూరం కావాల్సి వస్తుందన్న ఉద్దేశంతో శశికళ ఆ పార్టీ నాయకులతోనూ మాట్లాడలేదు. జయలలిత జయంతి నాడు మాత్రమే దినకరన్‌తో కనిపించారు.
Must Read ;- వామ్మో.. శశికళ స్వాగతానికి రూ. 200 కోట్లు ఖర్చా!
పార్టీ ప్రధాన కార్యదర్శిగా..
ప్రస్తుతం అన్నాడీఎంకేలో చేరడం లేదా ఆ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడం మాత్రమే లక్ష్యాలుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే జయలలిత జయంతి రోజున..తనకు తానుగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకున్నారు. ప్రకటన కూడా అదే హోదాతో చేశారు. దీనిపై ఇంకా అన్నాడీఎంకే స్పందించాల్సి ఉంది. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ తనకే దక్కుతుందని, ఆ పార్టీ గుర్తు అయిన రెండు ఆకుల గుర్తు కూడా తమకే చెందుతుందని శశికళ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో శశికళకు అనుకూలమైన తీర్పు వస్తే… ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటారు శశికళ. అలాంటి అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. ఇక శశికళను కలుస్తున్న వారిలో అన్నాడీఎంకేలో పెద్ద లీడర్లు లేకున్నా..అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్నవారు ఉన్నారు. జయలలిత జయంతి రోజున శశికళను కలిసిన వారిలో రాధిక, శరత్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. వారు నడుపుతున్న సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) 2011 నుంచి అన్నాడీఎంకేతో పొత్తులో ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాధిక, శరత్ కుమార్‌లు శశికళను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read ;- తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే