అన్నింటా తనదైన దూకుడుతో సాగుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన సొంత ప్రాంతం రాయలసీమకు మేలు చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎందుకు దూకుడు ప్రదర్శించరు. తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ దూకుడే ప్రదర్శించారు. ఇంకా చెప్పాలంటే.. ఏ విషయంలో చూపించనంత దూకుడును జగన్ ఈ ప్రాజెక్టులోనే చూపించారని చెప్పాలి. కేంద్రం ఆదేశాలు, పర్యావరణ అనుమతులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు.. ఇలా వేటినీ పట్టించుకోకుండానే జగన్ ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఈ కారణంగానే.. అప్పటిదాకా జగన్ తో స్నేహపూర్వకంగానే మెలగిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ ప్రాజెక్టు విషయంలోనే జగన్ తో విభేదించారు. ఏకంగా కోర్టులనూ ఆశ్రయించారు. ఇప్పుడు కేసీఆర్ సర్కారు పిటిషన్ ఫలితంగా జగన్ కోర్టులో దోషిగా తేలిపోయారు. జగన్ దోషిగా తేలితే.. శిక్ష మాత్రం అధికారులకు పడిపోతోంది. తండ్రి హయాంలో తాను నేర్చుకున్న విద్యను జగన్ బాగానే ప్రయోగిస్తున్న ఫలితంగానే.. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ జగన్ ఐఏఎస్ అధికారులకే శిక్ష పడేలా చేస్తున్నారు. మరి ఈ దఫా శిక్ష పడేదెవరికి? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
కోర్టు ధిక్కరణ తేలిపోయిందిలా
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొనగా.. ఈ ప్రాజెక్టును ఏపీ సర్కారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోందని తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి జాతీయ హరిత ట్రిబ్యూనల్ లో చాలా కాలం క్రితమే పిటిషన్ వేశారు. ఇదే విషయంపై ఇప్పుడు ఏపీతో వివాదం నేపథ్యంలో తెలంగాణ సర్కారు కూడా ఆ పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యింది. తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఎన్జీటీ సీమ ఎత్తిపోతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను అందించాలని ఇటు కృష్ణా జలాల యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)తో పాటు కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవలే కేఆర్ఎంబీ ప్రాజెక్టు పనులను పరిశీలించి జగన్ సర్కారు చెప్పిన దాని కంటే ఎక్కువగానే పనులు జరిగాయని తేల్చింది. ఈ మేరకు ఎన్జీటీకి నివేదిక కూడా అందించింది. ఈ సందర్భంగా సోమవారం చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తెలంగాణ సర్కారు అందించిన ఫొటోలను పరిశీలించిన కోర్టు.. ఈ ఫొటోలను చూస్తుంటే.. తెలంగాణ ఆరోపించిన దాని కంటే కూడా ఎక్కువగానే పనులు జరిగినట్టుగా ఉందని ఎన్జీటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ విషయంలో ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడిందని కూడా పేర్కొంది. అంటే.. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా స్వయంగా ఎన్జీటీనే తేల్చేసిందన్న మాటే కదా.
మరి జైలుకు వెళ్లేదెవరు?
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడిందని చెప్పిన ఎన్జీటీ.. మరి ఆ తప్పునకు అధికారులను జైలుకు పంపాల్సిందే కదా అంటూ వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటిదాకా అధికారులను జైలుకు పంపుతూ ఎన్జీటీ నేరుగా ఎప్పుడూ ఆదేశాలు జారీ చేయలేదని చెప్పిన ఎన్జీటీ.. అధికారులను జైలుకు పంపే విషయంలో ఎలా వ్యవహరించాలి? ఎన్జీటీనే నేరుగా అధికారులను జైలుకు పంపొచ్చా? హైకోర్టు ద్వారా పంపాలా? అన్న విషయంపై ఆలోచిస్తున్నట్లుగా పేర్కొంది. అంతేకాకుండా ఈ విషయంపై పిటిషనర్లు కూడా సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి జగన్ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తే.. ఎవరు వెళతారు? అన్నది అప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన అధికారి కాదు. మరి ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘ కాలం పాటు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సీఎస్ గా పదోన్నతి లభించిన సందర్భంగా ఆ శాఖలోనే పనిచేస్తూ సీఎస్ గా వచ్చారు. ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ జె.శ్యామలరావు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులను ఎన్జీటీ జైలుకు పంపాల్సి వస్తే.. అయితే గియితే శ్యామలరావు గానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సుప్రీం బాస్ గా ఉన్న సీఎస్ దాస్ గానీ జైలుకు వెళ్లక తప్పదు. అంటే జగన్ చూపిన దూకుడుకు ఈ ఇద్దరూ ఇప్పుడు జైలుకెళ్లే ప్రమాదంలో చిక్కుకున్నారన్న మాట.