పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ సాగింది. పోలవరం ఎత్తుపై ఎవరూ అనుమానపడాల్సిన పని లేదని, ఒక్క సెంటీమీటరు ఎత్తు కూడా తగ్గదని, అదే విధంగా పోలవరంలో దశల వారీగా పూర్తిగా నీరు నింపుతామని జల వనరుల మంత్రి అనిల్ యాదవ్ ప్రకటించారు. పోలవరం అంచనా వ్యయాన్ని 2014 ధరల ప్రకారం టీడీపీ ప్రభుత్వం అంగీకరించడం వల్లే అసలు సమస్య ఉత్పన్నమైందని మంత్రి సభలో వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ విష ప్రచారం చేశాయని, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్టు తాము ఎక్కడైనా చెప్పామా అని మంత్రి అనిల్ యాదవ్ ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
కేంద్రానికి లేఖలు రాయడం వల్లే..
పోలవరం అంచనా వ్యయం ప్రతిపక్ష టీడీపీ నేత వల్లే కేంద్రం తగ్గించిందని మంత్రి చేసిన ఆరోపణలను చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. పోలవరం నిర్మాణానికి రూ.20 వేల కోట్లు సరిపోతాయని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న మీరు కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రం రూ.20,382 కోట్లకు కుదించారని చంద్రబాబు సభలో వెల్లడించారు. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం వల్లే పరిహారం ఎకరాకు లక్షన్నర రూపాయల నుంచి పది లక్షలకు పెరిగిందని, అందువల్లే ప్రాజెక్టు వ్యయం కూడా రూ.57 వేల కోట్లకు చేరిందని చంద్రబాబు గుర్తు చేశారు. రివర్స్ టెండర్లు పేరుతో ఏడాది పాటు పోలవరం పనులు పడకేయించారని చంద్రబాబు సభలో విమర్శలు గుప్పించారు.
ముంపుపై తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కు
పరిహారం, ముంపు విషయంలోనే పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాలు పెరిగాయని, పెరగిన ఖర్చులు మీరు కేంద్రం నుంచి సాధిస్తారా? లేదా? అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. పోలవరం ముంపు తగ్గించి తెలంగాణ ప్రభుత్వంతో వైసీపీ నేతలు కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 28 మంది ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. టెక్నికల్ కమిటీ రూ.47వేల కోట్లకు అంగీకరించిందని, అది కూడా తెచ్చుకునే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేయడం లేదని చంద్రబాబు సభలో వివరించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చంద్రబాబు విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేది మేమే?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రం నుంచి సాధిస్తామని మంత్రి అనిల్ యాదవ్ సభలో సవాల్ విసిరారు. 2024లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తారా? అంటూ అనిల్ యాదవ్ ఛాలెంజ్ చేశారు. మేము ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతుండగా అనిల్ యాదవ్ వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి.











