ఏపీ ప్రజల జీవనాడి కొట్టుకుంటోంది. పోలవరం ఎత్తుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో అధికార వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. తాజాగా పోలవరం ఎత్తు సెంటీమీటరు కూడా తగ్గదని, కావాలంటే టేప్ తెచ్చి చంద్రబాబునాయుడు కొలుచుకోవచ్చంటూ జలవనరుల మంత్రి అనిల్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు పోలవరం ఎత్తును 45 నుంచి 41 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే పోలవరం ఎత్తులో ఎలాంటి తేడా లేదు, కానీ పోలవరంలో నీటి నిల్వలను 41 మీటర్ల వరకే చేస్తారట. దీంతో పోలవరం వ్యవహారం మరో మలుపు తిరిగినట్టయింది.
సెంటీమీటరు కూడా ఎత్తు తగ్గదు
పోలవరం ప్రాజెక్టుకును 45.15 మీటర్ల ఎత్తుకు డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 196 టీఎంసీలు. అయితే ప్రాజెక్టును 45.15 మీటర్లు నిర్మించి, నీటినిల్వ మాత్రం 41 మీటర్లు చేయాలని వైసీపీ ప్రభుత్వం అనధికారికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం 40 టీఎంసీలకు తగ్గిపోతుంది. ఏడు ముంపు మండలాలకు పరిహారం చెల్లించడానికి రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయి. అంత మొత్తం కేంద్రం ఇచ్చేట్టు కనిపించడం లేదు. అందుకే వైసీపీ అధినేత కొత్త ఆలోచనకు పదును పెట్టారని తెలుస్తోంది. పోలవరం ఎత్తు సెంటీమీటరు కూడా తగ్గదనే విషయాన్ని మీడియా సమావేశం పెట్టించి జలవనరుల మంత్రి అనిల్ యాదవ్ తో చెప్పించారని తెలుస్తోంది.
కేంద్రం ఇచ్చిన హామీ గాలికొదిలేశారా?
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పార్లమెంటులో చట్టం కూడా చేశారు. ఏడు ముంపు మండలాలను కూడా తెలంగాణ నుంచి ఏపీలో కలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యతను కేంద్రం భుజాలకెత్తుకుంది. అయితే ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ హయాంలో పోలవరం పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం అదే కొనసాగుతోంది. అయితే 2014 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.20,398 కోట్లు మాత్రమే. ఆ మొత్తాన్నే భరిస్తామని పోలవరం అథారిటీ చెప్పడంతో కేంద్రంతో పోరాడి సాధిచుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం భరించేలా ఒత్తిడి చేయకుండా...పోలవరంలో నీటినిల్వను 41 మీటర్లకు తగ్గించాలనే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పక్షం రోజుల కిందట జలవనరుల శాఖ అధికారులతో సీఎం జరిపిన సమావేశం కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41 మీటర్లకు మాత్రమే ఉంచితే ఎంత పరిహారం చెల్లించాల్సి వస్తుందన్న విషయంపైనే సాగింది. దీంతో పోలవరం ప్రాజెక్టును నిర్మించి, బ్యారేజీగా వాడుకోవాలని సీఎం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో పోలవరం ఇష్యూ పెద్ద రచ్చ అయింది.
గోదావరిలో వరద జలాలే కీలకం
గోదావరి నదికి ఏటా మూడుసార్లు వరదలు వస్తాయి. దీని ద్వారా ప్రతి సంవత్సరం 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలసిపోతోంది. ఈ నీటిని వాడుకునేందుకు డిజైన్ చేసిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. 45.15 మీటర్లు ఎత్తుకు నిర్మించుకుని పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసుకోవడం ద్వారా ఏటా 600 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పోలవరం కాలువల సామర్ధ్యం ప్రస్తుతం 30 వేల క్యూసెక్కులు ఉంది. వీటి ద్వారా ప్రతి రోజూ 3 టీఎంసీ నీటిని ఉపయోగించుకోవచ్చు. కుడి కాలువ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ప్రతిరోజూ అదనంగా మరో 2 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలించివచ్చు. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా పెన్నా డెల్టాకు తరలించవచ్చు. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసుకుంటే ఏపీ మొత్తం సస్యశ్యామలం చేసుకోవచ్చని మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మారిస్తే అంతకంటే మోసం మరొకటి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద పోలవరం ఎత్తు యవ్వారం, మరో మలుపు తీసుకుందన్నమాట.
Must Read ;- పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ‘రివర్స్’ ట్విస్ట్











