తెలంగాణలో పార్టీలకు ఇప్పుడు కోవర్టుల భయం పట్టుకుంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల అంతర్గత విషయాలు కూడా బయటకు పొక్కుతున్నాయి. ముఖ్యనేతల సమావేశాల విషయాలు, పార్టీ అంతర్గత వ్యూహాలు కూడా ఎదుటి పార్టీ వారి చెవిలో పడుతున్నాయి. ఏ పార్టీలో ఏం జరుగుతోందో మీడియా ద్వారా తెలుసుకోవడం ఆనవాయితీ. పార్టీల సమావేశాలకు సంబంధించిన అంశాలను మీడియా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తుంటుంది. అయితే, ఇప్పుడు పార్టీల అంతర్గత విషయాలు బయటకు పొక్కనివ్వడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో పార్టీలన్నీ బలోపేతం అయ్యేందుకు దూకుడుగా వెళుతున్నాయి. అధికార టీఆర్ఎస్ ఇతర పార్టీలను ఇక్కడ ఎదగనివ్వకూడదన్న అభిప్రాయంతో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బతీసిన ఆ పార్టీకి ఇప్పుడు కోవర్టుల భయం పట్టుకుంది. పార్టీలోని కొంత మంది నేతలు విషయాలను బయటకు లీక్ చేస్తున్నారంటూ ఆ పార్టీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కీలక విషయాలు బయటకు వెళ్తున్నాయా..
టీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక విషయాలు బయటకు పొక్కుతున్నాయని ఆ పార్టీ పెద్దల ఆలోచన. సాధారణంగా ఏ అంశమైనా చివరి వరకు సస్పెన్స్‌లో పెట్టడం కేసీఆర్‌కు అలవాటు. ఆయన ప్రకటన విడుదల చేయమన్న తరువాతే బయటకు వస్తుంది. ఈ మధ్య ఆయన చెప్పక ముందే సీక్రెట్‌గా చేసిన డిస్కషన్లు సైతం బయటకు వస్తున్నాయి. వారు చర్చించిన అంశాలపై వార్త కథనాలు కూడా వస్తుండటంతో పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఓ మంత్రే ఈ విషయాలను బయటకు చెబుతున్నారంటూ వరుస కథనాలు కూడా వచ్చాయి. టీఆర్ఎస్‌లో కోవర్టుగా పని చేస్తున్న ఆ మంత్రి ఎవరు.. ఇంత జరుగుతున్నా అధిష్టానం అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. కోవర్టుల వల్ల పార్టీకి నష్టం చేకూరుతోందని.. అంతర్గత విషయాలు ఇలా బయటకు పొక్కడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది.
బీజేపీలోనూ అదే తంతు..
ఇక తెలంగాణ బీజేపీకీ కోవర్టుల బెడద పట్టుకుంది. పార్టీలో అంతర్గతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు కూడా అధికార పార్టీ నేతల చెవిలో పడుతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు అప్రమత్తం అవుతున్నారు. బీజేపీ సంజయ్‌ను అధ్యక్షుడిగా నియమించిన తరువాత ధర్నాలు, ఆందోళనలు ఎంతో సీక్రెట్‌గా నిర్వహిస్తున్నారు. స్పాట్‌కు వెళ్ళే వరకు కూడా విషయం పోలీసులకు, మీడియాకు కూడా తెలియకుండా ఫీల్డ్‌లోకి దిగిపోతున్నారు.. అసెంబ్లీ ముట్టడి , కలెక్టరేట్ల ముట్టడి ఇలా అనేక కార్యక్రమాలు బీజేపీ నేతలు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆ తరువాత వారు అనుకున్న కార్యక్రమాలు నేరుగా పోలీసులు, ప్రభుత్వ పెద్దల చెవిలో పడుతున్నాయి. ఇదంతా తమ పార్టీలో ఉన్న కోవర్టుల వ్యవహారమే అంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక ఎన్నికల ముందు ఆ పార్టీ విషయం ఒకటి బయటకు పొక్కిందని.. ఆ పార్టీ నేతలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. మతకలహాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్న బీజేపీలో ఉన్న నేత ఒకరు తెలిపారని మీడియాలోనే ఆయన ప్రకటించారు . దీంతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. తమ పార్టీలో కోవర్టులు ఎవరన్న దానిపై విచారణ చేపట్టింది. ముఖ్యనేతల సమావేశాల విషయాలు బయటకు, ముఖ్యంగా ఎదుటి పార్టీ వారి చెవిలో వేసే వారు ఎవరన్న దానిపై ఆ పార్టీ పెద్దలు అంతర్గంగా సమాచారం సేకరిస్తున్నారు.