చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి పక్షానికే కోవిడ్ నిబంధనలు వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. ‘సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి ఆఫీసుకు రకరకాల వ్యాపకాల కారణంగా ఆలస్యమైతే.. అప్పటికే బాస్ ఆఫీసుకు వచ్చి ఉంటే..అందుకు సదరు ఉద్యోగి చెప్పే కారణాల జాబితా రెఢీగా ఉంటుంది. చాలావరకు అవే చెబుతుంటారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, ట్రాఫిక్ జామ్ అయిందని, బైక్ పంక్చర్ అయిందని..బస్సు మిస్సయిందని..ఇలా సమయాన్ని బట్టి ఒక్కో కారణం బయటకు తీస్తారు. నిజానిజాలు పక్కనబెడితే.. అప్పటికే ఆ కారణాలను వినీవినీ బాస్‌కి విరక్తి వచ్చి ఉంటుంది. అది బాస్ నమ్మడని సదరు ఉద్యోగికీ తెలుసు..కాని రీజన్ చెప్పాలి కాబట్టి చెప్తాడంతే’.. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం వెనుక కూడా అలాంటి రీజనే చెబుతున్నారనే కామెంట్లే వస్తున్నాయి.
పోలీసుల వైఖరిపై విమర్శలు..
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తిరుపతి పర్యటనకు అనుమతి లేదని, అందుకు కారణం కొవిడ్ నిబంధనలేనని, ఎన్నికల కోడ్ ఉందని రేణిగుంట ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు చెబుతున్న కారణంపై సోషల్ మీడియాలో సెటైర్లు చాలా పడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో పోలీసుల వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు కూడా స్వయంగా డీజీపీని పిలిపించినా.. కొందరు పోలీసుల వ్యవహారశైలిలో మార్పు రావడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి.
నిబద్ధతే ఉంటే..
అంతగా కొవిడ్ నిబంధనలు అమలు చేసే నిబద్ధతే పోలీసులకు ఉంటే.. కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలోనే మూకుమ్మడి విందులు, జగన్‌కు సన్మాన కార్యక్రమాలు చేపట్టిన వారిని కనీసం పట్టించుకోలేదంటనే ప్రశ్నలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే జగన్ హోర్డింగ్‌లతో ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ తీయడం, ఆ ర్యాలీలో పాల్గొన్నవారిలో కొందరికి కొవిడ్ కూడా వచ్చింది. అయితే పోలీసులకు అవేవీ కనిపించలేదనే విమర్శలు ఇప్పటికే వచ్చాయి. ఇక ప్రతిపక్ష నేత రామతీర్థం పర్యటనకు సిద్ధమైనప్పుడే వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు ఎలాంటి కొవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను పరిశీలిస్తే అందుకు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. కేవలం చంద్రబాబు పర్యటనకు సిద్ధం కావడంతోనే కొవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి అడ్డుకోవడంపైనే ఇంత చర్చ నడుస్తోంది. పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని మరో కారణం చెబుతున్నారు. అది పరిగణనలోకి తీసుకున్నా.. పర్యటనకు అనుమతి లేకపోవడంపై ఎన్నికల కమిషన్ ఏమైనా ఉత్తర్వు జారీ చేసిందా… నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించిందా అనేది కూడా క్లారిటీ లేదు. అదే సమయంలో కేవలం ప్రతిపక్షం వారి విషయంలోనే కొవిడ్ నిబంధన వర్తించేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
బైఠాయించిన చంద్రబాబు..
కాగా పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలోనే భైఠాయించారు. అనుమతి లేదంటూ పోలీసుటు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడే బైఠాయించారు. కాగా తాను కలెక్టర్ ని, ఎస్పీని కలవడానికి వెళ్తున్నానని, అందుకు వెళ్లనీయకపోవడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. వాళ్లే విమానాశ్రయానికి వస్తారని చెప్పిన పోలీసులు.. చంద్రబాబును మాత్రం బయటకు వెళ్లనీయకపోవడంతో చంద్రబాబు ఫైర్ అయ్యారు. తానేం అంత గొప్ప వ్యక్తిని కాదని.. నాకు నేనుగా వెళ్లి కలుస్తానని, ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రపంచానికి చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబుతో పాటు ఆయన పీఏ, వైద్యాధికారి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.