తెలుగులోకి ధనుష్ ‘సార్’ వచ్చేస్తున్నాడండోయ్. ఇది ఆయన సినిమా పేరులెండి. వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకట్టడం విశేషం. తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా నిర్మిస్తోంది. తమిళ వెర్షన్‌కు ‘వాతి’, తెలుగు వెర్షన్‌కు ‘సార్’ అనే పేర్లు ఖరారు చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా “యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్” అని పేర్కొన్నారు.
ఈ మోషన్ పోస్టర్ ప్రకారం ధనుష్ ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ ఉన్నాయంటే అంటే ఇది ఒక పీరియాడికల్ మూవీగా స్పష్టమవుతోంది. హీరో తన కలం బలంతో స్టూడెంట్స్‌కు ఒక రోల్ మోడల్ అవుతాడనుకోవచ్చు. ఇదే బ్యానర్‌లో ఇటీవల ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి చేస్తున్నారు.
కేరళకు చెందిన చార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది. ‘సూదు కవ్వం’, ‘సేతుపతి’, ‘తెగిడి’, ‘మిస్టర్ లోకల్’, ‘మార’ వంటి చిత్రాలకు పనిచేసి తనదైన ముద్రవేసిన సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి దీనికి పని చేయనున్నారు. జి.వి. ప్రకాష్‌కుమార్ దీనికి సంగీత దర్శకుడు. రెగ్యులర్ షూటింగ్ 2022 జనవరిలో మొదలవుతుందట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.











