పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్ర నిర్మాతల కోసం భీమ్లా నాయక్ చిత్రాన్ని వాయిదా వేశారు. భీమ్లా నాయక్ తో పాటుగా పవన్ కళ్యాణ్.. హరి హర వీరమల్లు అనే భారీ పిరియాడిక్ మూవీ చేస్తున్నారు. దీనికి విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది.
ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ సినిమా చేయాల్సి ఉంది. అలాగే స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం చేసేందుకు ఓకే చెప్పారు. అయితే.. ఇప్పుడు పవన్ జాబితాలో మరో కొత్త సినిమా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమా అంటే.. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం వినోదాయ సీతాం. తమిళంలో విజయవంతమైన ఈ సినిమానే తెలుగులో పవన్‌తో పునర్నిర్మించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కథను తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారని, ఇందులో పవన్ దేవుడుగా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సముద్రఖనినే దర్శకుడిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది తెలియాల్సివుంది. మరి.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.











