‘ఎఫ్ 2’ సినిమాతో క్రేజీ హీరోలతో మల్టీస్టారర్స్ తీయడానికి బాగానే అలవాటు పడ్డాడు.. దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే అనుభవంతో .. అదే వెంకీ, వరుణ్ హీరోలుగా ‘ఎఫ్ 3’ సినిమాను రూపొందిస్తున్నాడు. అయితే దీని తర్వాత రామ్ పోతినేనితో కూడా అనిల్ ఒక మల్టీస్టారర్ తీస్తాడనే వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అతడి మరో సినిమామీద కూడా షాకింగ్ అప్డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి.. నందమూరి హీరోలతో మల్టీస్టారర్ తీయబోతున్నాడట.
రీసెంట్ గా అనిల్ రావిపూడి నందమూరి బాలయ్యకి స్టోరీ నెరేట్ చేశాడని, ఆయనకి కూడా స్టోరీ బాగా నచ్చిందని, త్వరలోనే ఈ కాంబో మూవీ ఉంటుందనే వార్తలొచ్చాయి. అయితే బాలయ్యతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇందులో నటిస్తాడని లేటెస్ట్ అప్డేట్. నిజానికి ఈ ఇద్దరూ కలిసి.. ‘యన్టీఆర్’ సిరీస్ లో తండ్రీ కొడుకులు గా నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ..తండ్రి యన్టీఆర్ పాత్ర పోషిస్తే, కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషించి .. తనదైన శైలిలో రక్తికట్టించాడు. ఇప్పుడు మరోసారి బాలయ్య, కళ్యాణ్ రామ్ లు మళ్ళీ స్ర్కీన్ షేర్ చేసుకోవడం విశేషంగా మారింది.
నిజానికి అనిల్ రావిపూడికి దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ అన్న సంగతి తెలిసిందే. పటాస్ సినిమాతో అనిల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైంది. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ కాంబినేషన్ మీద మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.