తెలుగు సినిమా పాటను హుషారుగా పరుగులు తీయించిన సంగీత దర్శకులలో మణిశర్మ ఒకరు. ఇటు మాస్ సాంగ్స్ తో ఉత్సాహంతో ఊపేయడం .. అటు మధురమైన మెలోడీస్ తో మెప్పించడం ఆయనకే చెల్లింది. మణిశర్మ చేసినట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరెవరూ చేయలేరన్నంతగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలో స్టార్ హీరోల సినిమాలు ఆయన దగ్గర లైన్లో ఉండేవి.మధ్యలో ట్రెండ్ పేరుతో ఆయనకి కాస్త గ్యాప్ వచ్చినా, మళ్లీ పుంజుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టు ఉంది .. దాని పేరే ‘శాకుంతలం‘.
Also Read:-‘శాకుంతలం’ కోసం అందమైన సెట్స్ ప్లానింగ్
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన మణిశర్మతో ట్యూన్స్ చేయించుకుంటున్నారు. గతంలో గుణశేఖర్ సినిమాలకి మణిశర్మ అందించిన బాణీలు సూపర్ హిట్లుగా నిలిచాయి. అందువలన ఈ సినిమాకి కూడా ఆయన మణిశర్మనే ఎంచుకున్నారు. ఈ సినిమాలో మొత్తం 6కి పైగా పాటలు ఉండవచ్చని అంటున్నారు. కథా పరంగా మెలోడీస్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
Also Read:-గుణశేఖర్ తాజా చిత్రం ‘శాకుంతలం’
మణిశర్మ దీన్నొక ప్రత్యేకమైన చిత్రంగా భావించి, ఈ సినిమా కోసం అద్భుతమైన ట్యూన్లు ఇచ్చే పనిలో ఉన్నారని అంటున్నారు. ఆనాటి సామాజిక వాతావరణం .. ప్రేమ .. విరహం .. వాటిలో దాగిన సున్నితమైన హావభావాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ట్యూన్లు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కథాకథనాల తరువాత ఈ సినిమాను నడిపించే ప్రధానమైన అంశంగా ఆయన సంగీతాన్ని నిలపడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మణిశర్మ తన మధురమైన బాణీలతో కూడిన మాయాజాలంతో ప్రేక్షకులను కట్టిపడేయనున్నారన్నమాట.