మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ పాత్ర ఎలా ఉండబోతోంది. పైన చూస్తున్న ఫొటో అలాంటిదే కానీ ఇది అధికారిక లుక్ మాత్రం కాదు. రామ్ చరణ్ అభిమానుల పేరుతో ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా షూటింగులో రామ్ చరణ్ కూడా పాల్గొన బోతున్నారు. ఓ పక్క రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ తో రామ్ చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఈ ‘ఆచార్య’లో చేయాల్సి వస్తే గెటప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారన్న చర్చ కూడా ఓ పక్క నడుస్తోంది. ఎందుకంటే అది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం. మరి ఇందులో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన గెటప్ ఎలా ఉండబోతోంది అన్నదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఫొటో రూపొందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మణిశర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోకాపేటలో జరుగుతోంది.
దీనికోసం అక్కడ ఓ భారీ టెంపుల్ సెట్ కూడా వేశారు. ఇది కూడా దేవాలయాల బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశం. కొరటాల శివ అనగానే సమకాలీన అంశాలు కూడా అందులో చొప్పిస్తుంటారు. ఇటీవల దేవాలయాల్లో జరుగుతున్న విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు కూడా ఇందులో పెడతారా అన్న అనుమానాలు కూడా ఇంకో పక్క వస్తున్నాయి. ఈ టెంపుల్ సెట్ ను దాదాపు 20 ఎకరాల్లో వేశారు. ఇంతకుముందు మహేష్ బాబు అర్జున్ సినిమా కోసం మధురమీనాక్షి దేవాలయం సెట్ ను భారీగా వేశారు.
ఆ తర్వాత ఇలాంటి సెట్ వేయడం ఇదే ప్రధమం. ఇందులో రామ్ చరణ్ ది ఓ కీలక పాత్ర అని తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదలవుతుంది. తండ్రీకొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ లపై ఓ పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 10 వ తేదీ నుంచి ఈ పాట చిత్రీకరణ ఉంటుందన్నది సమాచారం.











