తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆ పార్టీ నాయకులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది బీజేపీలోకి వెళ్లనున్నారు. ఇదే అవకాశంగా భావించిన బీజేపీ నాయకులు.. ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈక్రమంలో బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ అయి, పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎన్నోసార్లు జరిగింది. ఈ నేపథ్యంలో డీకే అరుణ రాజగోపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలో చేరేందుకు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే పీసీసీ పీఠం దక్కించుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ పావులు కదిపారు. అధిష్టానం రేవంత్ రెడ్డివైపు మొగ్గు చూపుతుందనే వార్తలు వినిపిస్తున్ననేపథ్యంలో డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డికి దక్కితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Must Read ;- అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్: ఈటల రాజేందర్











