కరోనాకు కారణమైన వైరస్ రకాల్లో డెల్టా వేరియంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రస్ అధానోమ్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోనివారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది మరణించటానికి కూడ ఈ వేరియంటే కారణం. డెల్టా వేరియంట్‌పై యావత్ ప్రపంచం కలవరపడుతుండగా డబ్ల్యూహెచ్ ఓ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకు గుర్తించిన అన్ని కరోనా రకాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వేరియంట్ ఇదే కావడం దీనికి కారణం. ప్రపంచంలోని 85 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. టీకాలు వేసుకోని వారిలో ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని అని టెడ్రస్ అన్నారు. కాగా ఇటీవల చాలా దేశాలు కరోనా నిబంధనలను సడలిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరగడం ప్రారంభమైనట్లు తెలిపారు. కరోనా వైరస్ మరింత రూపాంతరం చెందే అవకాశముందని హెచ్చరించిన ఆయన వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కొత్త వేరియంట్లు రాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. 10 శాతం వ్యాప్తి వేగంలో ఆల్ఫా వేరియంట్ తర్వాత డెల్టానే ప్రమాదకర రకమని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్ -19 టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ పేర్కొన్నారు. టీకాలు వేసుకోని వారికి ఈ వేరియంట్ ముప్పు అధికంగా ఉందని ఆమె హెచ్చరించారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ల పంపిణీ వేగంగా సాగుతున్నప్పటికీ, ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందలేదని అన్నారు. కరోనా వేరియంట్ ఏదైనప్పటికీ దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నా మాస్కులు తప్పనిసరి
మరో వైపు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కేవలం వ్యాక్సిన్ మాత్రమే కరోనా వ్యాప్తిని నిరోధించలేదని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. టీకా రెండు డోసులు వేసుకున్న వారు మాస్కులు ధరించికపోయినా తమకు ఏమి కాదు అనే భావనలో ఉండవద్దని పేర్కొంది. కేవలం వ్యాక్సిన్లు మాత్రమే కరోనా వ్యాప్తిని నిరోధించలేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్నా సమూహ వ్యాప్తికి అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొంది. ప్రస్తుత సమయంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరంతో పాటు ఇతర కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్ డైరెక్టర్ మరియాంజెలా సిమావో సూచించారు.
Must Read ;- వైరస్ ఏదైనా వ్యాక్సిన్ ఒక్కటే!