పిల్లి మెడలో గంట ఎవరు కడతారనేది సామెత. ఇప్పుడు తెలంగాణలో థియేటర్ల వ్యవహారం కూడా అలానే
ఉంది. థియేటర్లు తెరుచుకోమన్నారు, తెరిచేశారు. మరి ఏ సినిమా రిలీజ్ చేయాలి. ఎప్పుడు రిలీజ్ చేయాలి. విడుదల చేస్తే ప్రేక్షకులొస్తారా? వచ్చిన ప్రేక్షకులతో ఇటు థియేటర్లకు డబ్బులు, అటు నిర్మాతలకు బ్రేక్-ఈవెన్ సాధ్యమా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో భయాలు. దీంతో థియేటర్లు మరోసారి ఖాళీ అయ్యాయి.
గతేడాది లాక్ డౌన్ తర్వాత సాయితేజ్ లాంటి హీరోలు తెగించి థియేటర్లలోకి వచ్చారు. సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఓ మోస్తరుగా విజయాన్నందుకుంది. ఆ ఉత్సహంలో 50శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ చాలా సినిమాలు ముందుకొచ్చాయి. కానీ సంక్రాంతికి క్రాక్ వచ్చేంతవరకు మళ్లీ థియేటర్లు స్తబ్దుగా మారాయి. అదే ఇప్పుడు అందరి భయం. తమ సినిమాను ముందుగా రిలీజ్ చేస్తే.. కనీసం ప్రింట్ ఖర్చులైనా వస్తాయా అనేది నిర్మాతల భయం.
మరోవైపు ఎగ్జిబిటర్ల పరిస్థితి మరోలా ఉంది. నిర్మాతలు తెగించి రిలీజ్ చేయడానికి ముందుకొచ్చినా, ఏ సినిమా పడితే అది థియేటర్లలో వేస్తే ఉపయోగం ఉండదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. చిన్న సినిమాలు రిలీజ్ చేస్తే కరెంట్ బిల్లులు కూడా రావని, నిర్మాతల నష్టం మాట అటుంచి, క్షేత్రస్థాయిలో ముందుగా తాము నష్టపోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకే ధైర్యం చేసి మిడ్-రేంజ్ హీరోలు ముందుకురావాలని వీళ్లు కోరుతున్నారు. కనీసం విశ్వక్ సేన్ నటించిన పాగల్ లాంటి సినిమాలైనా ముందుగా రావాలని అంటున్నారు. దీనికితోడు సినిమాలకు సంబంధించి ఇప్పుడు నడుస్తున్న విధానాన్ని తీసేసి, షేరింగ్ పద్ధతి పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో 30కి పైగా సినిమాలు సెన్సార్ పూర్తిచేసుకొని సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో 99శాతం సినిమాలు అన్నీ చిన్నవే. ఉన్నఫలంగా వాటిని రిలీజ్ చేస్తే చిన్న సినిమా నిర్మాతల పొట్టకొట్టడం, థియేటర్లకు మరింత గండికొట్టడం మినహా జరిగేదేం ఉండదు. అవే సినిమాల స్థానంలో మినిమం గ్యాప్ లో టక్ జగదీశ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్ని విడుదల చేస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. ఇవన్నీ ఫస్ట్ కాపీలతో సిద్ధంగా ఉన్నాయి.
మొత్తమ్మీద టాలీవుడ్ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పైకి చెప్పుకున్నంత ఆనందకరమైన పరిస్థితైతే మార్కెట్లో లేదు. ఇంకా చెప్పాలంటే థియేటర్లు తెరిచారని సంతోషించాలో, మంచి సినిమాలు లేవని బాధపడాలో అర్థంకాని స్థితి. నిజానికి టాలీవుడ్ లో పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉంటుంది. కాకపోతే ఈసారి లాక్ డౌన్ వల్ల ఇంకాస్త దారుణంగా తయారైందంతే. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది సింగిల్ స్క్రీన్స్ గురించి మాత్రమే. మల్టీప్లెక్సులకు ఈ బాధలేదు. తెలుగు లేకపోతే హిందీ, హాలీవుడ్ సినిమాలు ఆడించుకుంటారు. టిక్కెట్ డబ్బులతో పాటు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ డబ్బులు కూడా పోగేసుకుంటారు.
Must Read ;- ఓటీటీ విడుదలకు క్యూకడుతున్న చిత్రాలు