అందరు నటవారసుల్లాగానే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా టాలీవుడ్ లో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు . తొలి సినిమా ‘అల్లుడు శ్రీను’ తో హిట్టందుకున్నాడు. అయితే ఆ తర్వాత సినిమాలతో యాక్షన్ హీరోగా ఎలివేట్ అయ్యే ప్రయత్నం చేశాడు. డ్యాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ బాగానే రాణించాడు. అయితే అతడు ఆశించిన రీతిలో సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో యాక్షన్ హీరో కల కలగానే మిగిలిపోయింది. అయితే రాక్షసుడు సినిమాతో ఎట్టకేలకు మంచి హిటు కొట్టాడుకానీ.. అందులో బెల్లంకొండ హీరోయిజం కన్నా విలన్ సాడిజమే ఎక్కువ హైలైట్ అవుతుంది. కాబట్టి.. అతడికి యాక్షన్ ఇమేజ్ కలిసి రాలేదనే చెప్పాలి.
అయినా సరే.. శ్రీనివాస్ .. ‘అల్లుడు అదుర్స్’ అనే మూవీతో మళ్లీ అదే మాస్ ఇమేజ్ కోరుకుంటున్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రత్యేకత ఏంటంటే.. తన కెరీర్ బిగినింగ్ నుంచి నిన్న మొన్నటి రాక్షసుడు వరకూ అతడి సరసన దాదాపు అందరూ స్టార్ హీరోయిన్సే నటించారు. మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ లో సమంత, ‘జయ జానకి నాయక’లో రకుల్ ప్రీత్ సింగ్, ‘సాక్ష్యం’లో పూజా హెగ్డే, కవచం, సీత సినిమాల్లో కాజల్ ‘రాక్షసుడు’లో మల్లూ కుట్టి అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఇక అతడి తాజా సినిమా ‘అల్లుడు అదుర్స్’ లోనూ అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లోని అతడి మాస్ అవతారం జనానికి అంతగా రీచ్ అవ్వనప్పటికీ , హీరోయిన్స్ గ్లామర్ వల్ల ఆ సినిమాలకు కాస్తంతైనా పేరొచ్చింది. ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా కి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి అనూ ఇమ్మాన్యుయేల్ తో పాటు .. నభా నటేష్, నిధి అగర్వాల్ సైతం గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ లాంటి స్టార్ కేస్టింగ్ తో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమా అయినా .. బెల్లంకొండ బాబుకి మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.











