టిఆర్ఎస్ అంటే భయం పట్టుకుందేమో… లేదా బిజెపి కంటే వెనుకబడతామని ఆందోళన మొదలైందేమో.. కానీ కాంగ్రెస్ నాయకుల తీరు మాత్రం మారిందనే చెప్పుకోవాలి. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులందరూ ఒక్కటయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించుకునేందుకు కాంగ్రెస్ ముఖ్యనాయకులంతా నడుంబిగించారు. ఒక్కొక్కరు బాధ్యతలు పంచుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరు నేరుగా ఎన్నికల ప్రచార బరిలో పాల్గొంటుంటే మరి కొంత మంది నేతలు తెరవెనుక నుండి డైరెక్షన్ ఇస్తున్నారు.
ఎప్పుడూ లైట్… ఇప్పుడు సీరియస్..
ఉప ఎన్నికలంటే దాదాపు ఎప్పుడూ లైట్ తీసుకునే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సారి దుబ్బాక ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలనే కంకణం కట్టుకున్నారు. గతంలో ఎన్నికల్లో సాదా సిదాగా పోటీ చేసి, ఆ ఎన్నికల బాధ్యతను జిల్లా నాయకులకు అప్పగించేది. కానీ దుబ్బాక ఎన్నికల కాంగ్రెస్ ప్రిపరేషన్ చూస్తే కాంగ్రెస్ క్యాడర్‌కే ఆశ్చర్యం కలిగిస్తుందట. ఎప్పుడూలేనంతగా సీనియర్ నాయకులంతా దుబ్బాక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినారని చర్చించుకుంటున్నారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు బాధ్యతలను తీసుకున్నారు.
రాష్ట్ర నాయకత్వం రంగంలోకి..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా దుబ్బాక ఎన్నిక బాధ్యతలు చూస్తున్నారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు కూడా. అలాగే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపి విహెచ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క మరికొంత మంది నేతలు ఇంఛార్జీలుగా బాధ్యతలు తీసుకున్నారు. అంతే కాకుండా ఆ జిల్లా నాయకులను కూడా రంగంలోకి దింపింది. గ్రామానికి ఓ నాయకుడు, మండలానికి నలుగరు సీనియర్ నేతలను పేట్టేశారు. ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ వైఫల్యాలను ఎన్నికల అజెండాగా పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.
బిజెపికి భయపడా?..
మొదట దుబ్బాక ఉప ఎన్నికల గురించి కాంగ్రెస్ సీనియర్లు పట్టించుకోలేదనే ప్రచారం ఉంది. అయితే బిజెపి ఎన్నికల పోటీలో దూసుకుపోతుందని భావించిన కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ఇంఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ బాధ్యతలు తీసుకున్న తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలుగా దీనిని భావించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదేస్థాయిలో పార్టీ నాయకులను మాణిక్కం దిశానిర్ధేశం చేసినట్లు తెలుస్తోంది. బిజెపి ఓ వైపు రాష్ట్రంలో బలపడాలని ప్లాన్ వేస్తున్న నేపథ్యంలో బిజెపి ఉప ఎన్నికల్లో బలపడితే కాంగ్రెస్ వెనుకంజలో ఉంటే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టినట్లు అవుతోంది. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు రంగంలోకి దిగినట్లు చర్చ జరగుతోంది. ఒకవేళ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించకపోయినా రెండో ప్లేస్‌లో ఉన్నా పార్టీకి మేలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఓడినా కానీ తక్కువ ఓట్లతోనే ఓడేలా ఉండాలని భావిస్తుంది. ఈనేపథ్యంలోనే టిఆర్ఎస్‌కు ధీటుగా బలమైన నాయకుడిని పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావించింది. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లైన్‌లోకి పెట్టి టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంపయ్యేలా ప్లాన్ చేసింది. ఇలా స్థానికంగా బలమైన నాయకుడి కుమారుడిగా పేరున్న అభ్యర్థిని తమ పార్టీలోకి లాగి మొదటి ప్లాన్‌లోనే కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. అతి ముఖ్యమైన పోటీలో గెలిచి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఏదేమైనా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందని చెప్పాలి.
నామినేషన్ గడువు పూర్తి..
పోలీంగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో దుబ్బాక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు గడువు పూర్తి కానుంది. మొత్తం 46 మంది నామినేషన్లను ఇప్పటి వరకు వేయగా అందులో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దాంతో 34 మంది అభ్యర్థులు ఇప్పటి వరకు బరిలో ఉన్నారు. సాయంత్రం కల్లా వీటిపైన కూడా ఒక క్లారటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలతో పాటూ ఇండిపెండెంట్ అభ్యర్థులు, చిన్న చిన్న పార్టీలు కూడా బరిలో నిలిచాయి.