139 మంది తనపై కొన్నేళ్లుగా అత్యాచారం చేశారనే ఆరోపణలతో ఇటీవలి సంచలనంగా వార్తల్లోకి వచ్చిన యువతి.. అవన్నీ కట్టుకథలే అని తేల్చేసి.. వ్యవహారాన్ని తెరవెనుక సూత్రధారి డాలర్ భాయ్ అంటూ ఆయన మీదకు మళ్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఏళ్లతరబడి అత్యాచారాలు అనే టాపిక్‌కు ఇప్పుడు డాలర్ భాయ్ కేంద్రబిందువు అయ్యారు. తాజాగా ఆయన ఆ ఎపిసోడ్ కు మరికొన్ని ట్విస్టులు జత కలిపారు.
ఆగస్టు 29 తేదీన తనను కిడ్నాప్ చేయాలని చూశారంటూ డాలర్ భాయ్ చెప్పుకొచ్చారు. కిడ్నాపర్లు నుండి తప్పించుకొని ఏసీపీకి కాల్ చేశానంటా డాలర్ బాయ్ చెప్పడం సంచలనంగా ఉంది. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసిన డాలర్ భాయ్.. ఆరోపణలు చేసిన యువతి.. నిజానికి వ్యభిచారం చేసిందని ఆరోపించాడు.
‘నాకు మ్యాట్రిమోనిలో పరిచయం అయింది. నా కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా పని చేసింది’ అని ఆమె గురించి చెప్పుకొచ్చాడు. తనను చంపుతారనే భయంతోనే తప్పించుకొని తిరుగుతున్నట్టుగా డాలర్ బాబు వెల్లడించాడు.
తనకు పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి ఎలాంటి బెదిరింపులు రాలేదని, ఆ అమ్మాయి సర్టిఫికెట్లు ఎవరు ఎత్తుకెళ్ల లేదని, ఆమె తన దగ్గరే సర్టిఫికెట్లు పెట్టుకుని అబద్ధాలు చెప్తోందని డాలర్ భాయ్ ఆరోపించడం గమనార్హం. అందర్నీ నమ్మించడానికి సర్టిఫికెట్లు రజనీ చౌదరి ఇచ్చినట్లు వీడియో తీశామని కూడా అతను పేర్కొన్నాడు. కోనేటి అశోక్ , సుమన్ వల్ల తనకు ప్రాణ హానీ ఉందని డాలర్ భాయ్ వెల్లడించాడు.
మలుపుల మీద మలుపులు
కొన్ని సంవత్సరాల పాటు 139 మంది వ్యక్తులు తనపై విడతలువిడతలుగా అత్యాచారం చేశారంటూ ఒక యువతి పోలీసు స్టేషన్ ను ఆశ్రయించినప్పుడే.. ఈ కేసుపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ వార్త పెద్ద సంచలనం అయింది. ఇంతలోనే ఆమె తాను చెప్పిన మాటలన్నీ కట్టుకథలని తేల్చేసింది. సూత్రధారిగా డాలర్ భాయ్ పైకి నెట్టింది. ఇప్పుడేమో అతను అమ్మాయి మీదనే ఆరోపణలు చేస్తూ.. ప్రాణహాని అంటున్నాడు. ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.










