అనంత చతుర్దశి వ్రతం గురించి మీకు తెలుసా? ఈ వ్రతం ఎప్పుడొస్తుంది? ఈరోజున ఏంచేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం. భాద్రపద శుక్ల చతుర్దశినాడు జరుపుకొనే వ్రతమే అనంత చతుర్దశి వ్రతం. అంటే ఈరోజేనన్న మాట. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ఈ వ్రతాన్ని చేయమని చెబుతుంటారు. దీన్ని అనంత పద్మనాభ వ్రతం అని కూడా అంటారు.
ఈ వ్రత ప్రస్తావన మన మహాభారతంలోనూ కనిపిస్తుంది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమని వేడుకొంటాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయమని సూచించాడట. అనంతుడన్నా, అనంత పద్మనాభస్వామి అన్నా సాక్షాత్తూ కాలమే. యుగ , సంవత్సర, మాసం తదితర కాలమంతా తన స్వరూపమేనని గీతలో అన్నాడు కదా. అనంత పద్మనాభుడంటే కాల స్వరూపుడైన వైకుంఠవాసుడే.
వ్రత పూజను గమనిస్తే అనంత పద్మనాభ అవతారం కళ్ల ముందు కదులుతుంది. వ్రతాచరణ కోసం పిండితో ఏడు పడగల పామును చిత్రిస్తారు. దర్భలతో పాము బొమ్మను చేసి పూజిస్తారు. దర్భలతో చేసిన పామును మూతపెట్టిన కలశం మీద ఉంచి పూజిస్తారు. ఈ మొత్తంలోనూ శేషశయనుడి రూప భావన కనిపిస్తుంది. వ్రతంలో ఉంచటం కోసం సిద్ధం చేసుకొన్న కలశంలో పవిత్ర జలాలను ఉంచుతారు. ఆ నీటిలో కొద్దిగా పాలు, ఒక పోకచెక్క , ఓ వెండి నాణెం వేస్తుంటారు. కలశంలోని నీటిలోకి యమునా నదిని ఆవాహన చేస్తుంటారు. అనంతపద్మనాభస్వామి పూజలో పద్నాలుగు సంఖ్యకు ప్రాధాన్యం ఉంటుంది.
పద్నాలుగు లోకాలను ఏలే ఆ స్వామి పూజ అనే భావన కలిగేందుకు ఆనాడు పూజించే సర్పాకృతికి పద్నాలుగులో సగమైన ఏడు సంఖ్యలో పడగలను పెట్టడం, పద్నాలుగుకు రెండింతలైన ఇరవై ఎనిమిది సంఖ్యలో గోధుమ పిండితో పిండి వంటలు చేసి పద్నాలుగేళ్ల కోసారి వ్రతానికి సంబంధించిన ఉద్యాపన చేయటం కనిపిస్తుంటుంది. ఈ వ్రతంలో ప్రధానాంశమైన చేతికి ధరించే ఎర్రటి తోరానికి 14 ముడులుంటాయి. మరి కొందరు నైవేద్యానికి 14 రకాల పండ్లు , పిండి వంటలు , పూజ కోసం పత్రిని వాడుతుంటారు. ఇదంతా ఏడేడు పద్నాలుగు లోకాలను ఏలే కాలస్వరూపుడైన ఆ దివ్య మంగళ స్వరూపుడిని తలచుకోవటం కోసమే. ఈ వ్రతంలో కలశాన్ని పెట్టి పూజ చేయటాన్ని పురోహితుడి సాయంతో చేసుకోవటం మేలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వ్రతాన్ని చేసే దంపతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసముంటుంటారు.
సత్యం ధర్మమే ఈవ్రతానికి ఆధారం
వ్రత కథను పరిశీలిస్తే అంతా సత్యం , ధర్మం మీద ఆధారపడి ఉన్నట్లుంటుంది. సత్యధర్మాలను అనుసరించేవారు దైవకృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించినవారు జన్మజన్మలకూ కష్టాలు అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందన్న హెచ్చరిక కనిపిస్తుంది. తనను తినబోయిన పులికి ఓ ఆవు కాసేపు ఆగమని , ఇంటికి వెళ్లి తన లేగదూడకు పాలిచ్చి వస్తానని చెప్పి ఆడిన మాటను నిలబెట్టుకొని పులి దగ్గరకు వెళ్లి సత్యవ్రతాచరణను చాటిన కథను ఈ వ్రత సందర్భంగా చెప్పుకొంటుంటారు. ఆనాడు ఆ ఆవు తన ప్రాణాల కన్నా సత్యమే మిన్న అని భావించింది. తన లేగదూడకు కడుపునిండా పాలుపట్టి ధర్మాన్ని బోధించింది. అలాంటి ధర్శ జీవన విధానాన్ని ఈ వ్రత సందర్భంగా తలచుకుంటారు.
వ్రతం ఎలా చేసుకోవాలి?
ఇంటినీ, పూజామందిరాన్నీ శుభ్రపరుచుకోవాలి. అభ్యంగన స్నానంచేసి పూజ గదిలో అష్టదశ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ ముగ్గులతో అలంకరించుకోవాలి. దానికి దక్షిణ భాగంలో నీరు నింపిన కలశం పెట్టాలి. ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకుని అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిష్ఠించాలి . దర్బలతో అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తర్వాత ‘ యమునా పూజ ‘ చేయాలి. యమునా పూజ అంటే నీటిని పూజించటమే.
బిందెతో నీటిని తెచ్చుకొని ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి. తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి బెల్లంతో చేసిన 28 అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. వ్రతకథ చెప్పుకొని అనంత పద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి. వ్రతముతో తోరాన్ని కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి. ఈ వ్రతం చేయదలుచుకున్నవారికి ఈరోజు మాత్రమే అవకాశం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడే సులభమార్గం ఇదే మరి.











