తెలంగాణాలో ఎన్నికలు రానున్నాయి. అవును మీరు చదివింది నిజమే. తెలంగాణాలో ఎన్నికలు రానున్నాయి. అదేమిటీ… శాసనసభకు ఇంకా మూడేళ్లు, పార్లమెంట్ కు మూడున్నరేళ్లు సమయం ఉందిగా ఇప్పుడు ఎన్నికలు ఏమిటనుకుంటున్నారు. మీరు చదివింది నిజమే. తెలంగాణాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇంతకీ అవేం ఎన్నికలంటే.. గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు. ఈ ఎన్నికలైతే సాధారణ ఎన్నికలంత హడావుడి ఎందుకనుకుంటున్నారు.
ఏం లేదు… ఈ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను తలపించనున్నాయి. తొలిసారి తెలంగాణాలో గొర్రెల పెంపంకందారుల సహకార సంఘాలకు ఎన్నికలు రాజకీయ పార్టీల నీడలో జరుగనున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ ఎన్నికలకు ప్రకటన విడుదల చేయనున్నారు. దీంతో రాజకీయ పార్టీల్లో హడావుడి ప్రారంభమైంది. గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లోగా ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. తెలంగాణా వ్యాప్తంగా ఐదు వేలకు పైగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలున్నట్లు చెబుతున్నారు.
వీటికి అధ్యక్షలు, కార్యదర్శులు, కోశాధికారులలో పాటు సంఘం సభ్యులు కూడా ఉంటారు. ఒక్కో సంఘంలోనూ రెండు నుంచి మూడు వేల మంది వరకూ సభ్యులున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలకు ప్రాముఖ్యం పెరిగింది. పైగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో గొర్రె పెంపకం దారుల నాయకులు కొందరు రాష్ట్ర స్ధాయిలో పెద్ద పదవుల్లోనే ఉన్నారు. వీరి పేర్లు ఇప్పటి వరకూ వెల్లడి కాకపోయినా ఈ ఎన్నికల్లో మాత్రం వారెవరో తేలుతుందంటున్నారు.
కసరత్తు షురూ…
గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలకు జిల్లాల్లో ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ అధికారులను ఎన్నికల పర్సన్ ఇన్ చార్జీలుగా నియమించారు. వారి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు జరుగుతాయంటున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సంఘాల్లోని సభ్యులకు ఓటరు లిస్టు తయారు చేయడం, వాటిని కంప్యూటరీకరించడం వంటి పనులకు పశు సంవర్ధక శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల స్ధాయిలో ఎన్నికలు జరిగిన తర్వాత జిల్లా స్ధాయిలో మరో కమిటీని ఎన్నుకుంటారు. ఆ కమిటీలన్నీ రాష్ట్ర స్ధాయి కమిటీని ఎన్నుకుంటాయి. ఈ కమిటీతోనే ప్రభుత్వం వారి సమస్యలు, సంక్షేమం వంటి అంశాలపై చర్చలు జరుపుతుంది. ఇంత ప్రక్రియ ఉండడంతో తెలంగాణాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలకు అత్యంత ప్రాధ్యనం వచ్చింది.
పైరిగిన రాజకీయ చైతన్యం
గొర్రెల పెంపకందారుల్లో ఇప్పుడు రాజకీయ, సామాజిక చైతన్యం చాలా పెరిగింది. గతంలో గొర్రెల మందలతో జిల్లాలకు జిల్లాలు దాటుకుంటూ వెళ్లే గ్రొరెల పెంపకం దారుల ప్రతినిధులు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలలో కీలక స్ధానాలలో ఉన్నారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు పెంపకం దారులు, వారి కుటుంబాలకు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ చాలాకాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా గొర్రెల పెంపకం దారుల ఇక్కట్లపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. దీంతో త్వరలో జరుగనున్న గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలకు చాలా ప్రాధాన్యం వచ్చిందని రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు.











