(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టడంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళనలు తీవ్రతరం చేశారు. సోమవారం సాయంత్రం కూర్మన్నపాలెం ఆర్చి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించారు. కేంద్రం ఇచ్చిన ప్రతులను తగులబెట్టారు. మంగళవారం స్టీల్ ప్లాంట్ ఎడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి వేలాది మంది ఉద్యోగులు, కార్మిక సంఘాల కార్యకర్తలు హాజరు కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టీల్ ప్లాంట్ అధికారుల విధులకు హాజరు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ మురళి, బాలాజీలను కారు దిగకుండా చుట్టుముట్టారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయనను కారు దిగనివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం సిఐఎస్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకుని ఆయన సురక్షితంగా లోనికి తీసుకెళ్ళారు. ఈ క్రమంలో ఆయన రోడ్డుపై పరుగులు పెట్టాల్సి వచ్చింది. కేంద్రానికి తొత్తులుగా మారారని, ఏ విషయాలు కార్మిక సంఘాలకు లీక్ కాకుండా వ్యవహరిస్తున్నారని అధికారులపై ఉద్యోగుల మండిపడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగుతుండడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అనేక వాహనాల టైర్లలో ఆందోళనకారులు గాలి తీసివేశారు. ఫైనాన్స్ డైరెక్టర్ వాహనం నెంబర్ ప్లేట్లను సైతం ధ్వంసం చేశారు. మరోవైపు తెలంగాణ మావోయిస్టు పార్టీ నేతలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదన్న నిర్మలా సీతారామన్.. రగిలిపోయిన కార్మిక సంఘాలు











