(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ఎంపీలు జి మాధవి, ఎం వి వి సత్యనారాయణలు స్టీల్ ప్లాంట్‌పై అడిగిన ప్రశ్నకు లోక్‌సభ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్‌ప్లాంట్ అమ్మకంపై జగన్ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని నిర్మల సీతారామన్ ప్రకటించడమే కాకుండా, స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధంలేదని ఆమె చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు. దీంతో ప్రైవేటీకరణ తప్పదని ఆమె స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ వల్ల ఉత్పాదన శక్తి పెరుగుతుందని ఆమె వెల్లడించడంతో కార్మిక సంఘాలు మరోమారు సోమవారం సాయంత్రం రోడ్డు ఎక్కారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు 48 గంటల్లో ట్రేడ్ యూనియన్ నేతలంతా సమావేశం కానున్నారు. కేంద్రం ఇచ్చిన ప్రతులను కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద తగులబెట్టారు. విశాఖ కూర్మన్నపాలెంలో కార్మిక సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ కారణంగా కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచాయి. అనకాపల్లి నుంచి విశాఖ నగరానికి వచ్చే వాహనాలను లంకెలపాలెం వద్ద నుంచి సబ్బవరం మీదుగా నగరంలోకి మళ్లిస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన నేపథ్యంలో ఉక్కు పరిసరాల్లోకి వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపి వేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఇక అమ్మకమే తరువాయి!