Employees Union Leaders Met AP Government Chief Advisor Sajjala Ramakrishnareddy
సీన్-1:
ఉద్యోగుల సమస్యలపై ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాలు నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక్కటై ప్రభుత్వంపై పోరు సాగించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ కలిసి గత వారం మీడియా ముందుకు వచ్చారు. ఈ విషయం ఎలా తెలిసిందో గానీ.. ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోయింది. ఇంకేముంది.. వెంటనే మొబైల్ అందుకుని వారికి ఫోన్ చేశారు. సజ్జల ఫోన్ వచ్చే సమయానికి బండి, బొప్పరాజులు మీడియా సమావేశంలో ఉన్నారు. అయినా కూడా సజ్జల నుంచి కాల్ వచ్చేసరికి వారిద్దరికీ ముచ్చెమటలు పట్టాయి. చొక్కాలు తడిసిపోయాయి. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి.. ఇకపై తమ రెండు సంఘాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సీన్-2:
ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాలు నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు వారి సంఘాల ప్రతినిధులను వెంటేసుకుని మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్దకు వెళ్లారు. వారిని సజ్జల సాదరంగానే లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారిద్దరూ సజ్జలకు ఓ వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన బాట పడతామని కూడా సజ్జలకు చెప్పేశారట. తన వద్దకు వచ్చిన వారిద్దరి నుంచి వినతి పత్రం అందుకున్న సజ్జల ఆయా సమస్యల పరిష్కారం నిమిత్తం రెండు రోజుల్లోగా ఉన్నతాధికారులతో భేటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ దక్కిన మరుక్షణమే సజ్జల కార్యాలయం నుంచి బయటకు వచ్చేసిన బండి, బొప్పరాజులు అక్కడే.. చెమటలు పట్టకుండా, చొక్కాలు తడిసిపోకుండానే ధైర్యంగా మీడియాతో మాట్లాడారు.
ఏం జరిగి ఉంటుంది..?
తొలి సీన్‌లో సజ్జల అనుమతి లేకుండా బండి, బొప్పరాజులు మీడియా సమావేశం పెట్టేశారు. అయినా ఉద్యోగ సంఘాల నేతలుగా మీడియా సమావేశం పెట్టాలంటే బండి గానీ, బొప్పరాజు గానీ సజ్జల అనుమతో, లేదంటే సీఎం అనుమతో తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే అది టీడీపీ పాలనలో చెల్లుబాటు అయ్యిందేమో గానీ.. వైసీపీ జమానాలో చెల్లుబాటు కాదు కదా. ప్రతి విషయంలోనూ జగన్ సర్కారు పెద్దల అనుమతి లేకుండా చీమ చిటుక్కుమనడానికి కూడా అవకాశం లేనట్లుగా పరిస్థితి తయారైంది కదా. మరి ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రభుత్వ పెద్దల అనుమతి లేకుండా బండి గానీ, బొప్పరాజు గానీ, ఇద్దరూ కలిసి గానీ మీడియా ముందుకు ఎలా వెళతారు? అందుకే కాబోలు గత వారంలో వారిద్దరూ మీడియా సమావేశంలో ఉండగానే ఫోన్ చేసి మరీ అదిలించిన సజ్జల.. ఇప్పుడు తన వద్దకే నేరుగా వచ్చి సమస్యలను వినతి పత్రం రూపంలో ఇచ్చి.. మీడియాతో మాట్లాడేందుకు అనుమతి తీసుకుని మరీ వచ్చారేమో. అందుకే నాడు చెమటలతో తడిసి మీడియా సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన బండి, బొప్పరాజు.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ధైర్యంగా మాట్లాడారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- సజ్జల ఫోన్ చేస్తే ఇలాగుంటుందా?