నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అంటే 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టమే. తాను సీఎం అయినా కూడా రాజధానిని అమరావతి నుంచి తరలించబోనని చెప్పారు. ఆ మాటను జనం నమ్మేలా అమరావతి పరిధిలోని తాడేపల్లిలోనే తన ఇంటిని కూడా ఆయన నిర్మించుకున్నారు. జగన్ మాటను జనం నమ్మారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కూడా జగన్ మాటను నమ్మారనే చెప్పాలి. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయమే ఇందుకు నిదర్శనం. అయితే ఎన్నికలు ముగిసి ఫలితాలు విడుదలయ్యాక మాత్రం జగన్ మాట మార్చేశారు. అమరావతి ఒకే కులానికి చెందిన వారిదిగా కొత్త భాష్యం చెప్పారు. అమరావతి భూ సమీకరణలో పెద్ద కుంభకోణమే జరిగిందని, దానిపై దర్యాప్తు చేపడతామని, ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సహా అందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని కూడా సంచలన ప్రకటన చేశారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసిన వేదిక మీద నుంచే జగన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఒక్క ప్రకటనతోనే అమరావతిని పురిట్లోనే చంపేస్తానని జగన్ చెప్పినట్లైందన్న వాదనలు వినిపించాయి.
మాటల వెంటే చేతలు కూడా
కేవలం ప్రకటనలకే పరిమితం కాని జగన్.. అమరావతిని పురిట్లోనే చంపేసే దిశగా చర్యలనూ చేపట్టారు. ఓ వైపు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై దర్యాప్తు జరపాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన జగన్ సర్కారు.. మరోవైపు తన కేబినెట్‌లోని మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు. జగన్ చెప్పినట్లుగానే కేబినెట్ సబ్ కమిటీతో పాటు సీఐడీ కూడా అమరావతి భూముల సమీకరణలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లుగానే నివేదికలు ఇచ్చాయి. అయితే ఈ నివేదికలేవీ కోర్టుల్లో నిలవడలేదు. ఇటు ఏపీ హైకోర్టు సహా అటు సుప్రీంకోర్టు కూడా అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్టుగా తమకు ఆధారాలేమి కనిపించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాయి. అయినా ఫిర్యాదులు లేకుండా.. ఫలానా చర్యతో తాము నష్టపోయామని నిందితుల ఫిర్యాదు లేకుండా ఎలా కేసులు నమోదు చేస్తారంటూ ఇటీవలే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏపీ సర్కారు తీరును కడిగిపారేసింది. అంటే.. అమరావతిపై జగన్ సర్కారు చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కదానికి కూడా ఆధారం లేదు. అంటే.. ఈ ఆరోపణలన్నీ గాలి కబుర్లేనన్న మాట. ఎంత చేసినా.. అమరావతిని జనం మదిలో నుంచి తొలగించలేకపోతున్నామనే భావన జగన్ సర్కారును నిలువనీయడం లేదనే చెప్పాలి.
అమరావతిని తొలగించి ఖాళీ పెట్టేశారే
తాజాగా జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని ఎలాగైనా జనం మదిలో నుంచి తొలగించాల్సిందేనన్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాల్లో భాగంగా ఉన్న అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించేసింది. అయితే అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించినా.. దాని స్థానంలో ఏ పాఠ్యాంశాన్ని చొప్పించాలో తెలియని జగన్ సర్కారు.. పాఠ్యాంశాల సంఖ్యను కుదించేసి చేతులు దులుపుకుంది. ఏపీ విద్యా వ్యవస్థకు సంబంధించి పదో తరగతిలో తెలుగు సబ్జెక్టులో మొత్తం 12 పాఠ్యాంశాలున్నాయి. అందులో 2వ పాఠ్యాంశంగా అమరావతి ఉంది. అమరావతిని కేవలం ఏపీ రాజధానిగానే కాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పరిచయం చేస్తూ ఆ పాఠ్యాంశం సాగుతోంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాల ముద్రణ, విద్యార్థులకు పంపిణీ అప్పుడు ముగిసింది. అయితే జగన్ స్వయంగా ఆదేశించారో, లేదంటే.. అంతగా అనుభవం లేని ఇతరులు ఎవరైనా ఆదేశించారో తెలియదు గానీ.. పదో తరగతికి చెందిన తెలుగు సబ్జెక్టులో రెండో పాఠ్యాంశంగా ఉన్న అమరావతిని తొలగించి తిరిగి ఆ సబ్జెక్టు పుస్తకాలను మాత్రం మళ్లీ ముద్రించాలని ఆదేశాలు వెలువడ్డాయట. ఈ ఆదేశాలు జారీ చేసిన వారు.. అమరావతిని తొలగిస్తే.. దాని స్థానంలో ఏ పాఠ్యాంశాన్ని చేర్చాలో చెప్పాలి కదా. ఆ మాట వారు చెప్పలేదు. విద్యాశాఖ అధికారులు వారిని అడిగే సహసం చేయలేదు. వెరసి కొత్తగా ముద్రితమైన టెన్త్ తెలుగు పుస్తకంలో 11 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయట. అంతకుముందు అమరావతితో కలిపి 12 పాఠ్యాంశాలు ఉన్నా.. అమరావతిని తొలగించి 11 పాఠ్యాంశాలతోనే పుస్తకాన్ని ముద్రించారట. మరి పేజీ నెంబర్లైనా మార్చారో, లేదోనంటూ ఈ విషయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి అమరావతిని తొలగించాలని జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసినా.. అమరావతికి ప్రత్యామ్నాయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతోందని కూడా చెణుకులు వచ్చి పడుతున్నాయి.
Must Read ;- మరీ ఇంత దిగజారుడుతనమా?











