ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రభుత్వ ఖర్చులతోనే స్పెషల్ ఫ్లైట్లలో విహరించే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్ ఇలాగే సర్కారీ సొమ్ముతో అద్దెకు తీసుకున్న ఫ్లైట్‌లోనే వెళ్లి వస్తున్నారు. అయితే సోమవారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మాత్రం ఆయన ప్రయాణించిన ఫ్లైట్ చూసిన వారంతా ఇదేంటంటూ నోరెళ్లబెట్టారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరమలకు వస్తున్న క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టులో చార్టెర్డ్ ఫ్లైట్ ఎక్కిన జగన్.. రేణిగుంట విమానాశ్రయంలో దిగారు. ఈ సందర్భంగా జగన్ విమానం దిగుతున్న సందర్భంగా తీసిన ఓ ఫొటోలు ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే.. ఆయన దిగిన విమానం ప్రభుత్వ ఖర్చుతో అద్దెకు తీసుకున్న స్పెషల్ ఫ్లైట్ కాదు. అది అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రైవేట్ జెట్.
అదానీలతో బంధం గట్టిదే
గౌతం అదానీ ఎవరో తెలుసు కదా. ఆయన నేతృత్వంలోని అదానీ గ్రూప్ గురించి కూడా తెలిసిందే కదా. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జెట్ స్పీడులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న బిజినెస్ మన్‌గా అదానీ అందరికీ తెలిసిన వారే. అంతేకాదండోయ్.. జగన్ సీఎం అయ్యాక ఏపీలోని కీలక పోర్టులన్నీ కూడా అదానీ గ్రూపు చేతిలోకే వెళ్లిపోతున్నాయి. ఇటీవలే గంగవరం పోర్టును పూర్తిగా అదానీకి కట్టబెట్టిన జగన్ సర్కారు.. అందులోని ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకున్న తీరు ఎలాంటిదో అందరూ చూసిందే. మొత్తంగా అదానీ.. ఇటు మోదీ సర్కారుతో పాటు ఇటు జగన్ సర్కారుకు కూడా బాగా కావాల్సిన పారిశ్రామికవేత్త కిందే లెక్క. అంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోర్టులను జగన్ సర్కారు అప్పనంగా అప్పగిస్తుంటే.. అదానీ మాత్రం జగన్ జల్సాగా పర్యటనలు సాగించేందుకు సకల సౌకర్యాలతో సమకూర్చుకున్న తన ప్రైవేట్ జెట్‌ను ఇస్తున్నారన్న మాట.
అంబానీ ఫ్లైట్‌నూ వాడేశారట
ఇదిలా ఉంటే.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా పేరొందారు. ఫోర్బ్స్ జాబితాలో ఆయనను మించిన బిజినెస్ మన్ ప్రస్తుతానికి దేశంలోనే లేరు. ప్రపంచ దేశాల్లోనూ అంబానీని మించిన వారు ఇద్దరో, ముగ్గురో మాత్రమే ఉన్నారు. ఇంతటి పెద్ద బిజినెస్ మన్‌కు చెందిన ప్రైవేట్ జెట్‌ను కూడా జగన్ ఓ దఫా వినియోగించారట. ఇటీవలే తన వివాహ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు జగన్ ఫ్యామిలీతో పాటు డార్జిలింగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. గన్నవరం నుంచి డార్జిలింగ్‌కు ఏ విమానంలో వెళ్లారో తెలియదు గానీ.. వచ్చేటప్పుడు మాత్రం అంబానీ ప్రైవేట్ జెట్‌నే జగన్ వినియోగించారట. అంబానీ అడిగిన వెంటనే పరిమళ్ నత్వానీకి జగన్ రాజ్యసభ సీటిచ్చారు కదా.. దానికి ప్రతిగా జగన్ టూర్లకు తన ప్రైవేట్ జెట్లను పంపుతూ అంబానీ రుణం తీర్చుకుంటున్నారన్న మాట. సీఎం హోదాలో ఉండి.. పెద్ద పెద్ద బిజినెస్ మన్‌లకు చెందిన ప్రైవేట్ జెట్లలో విహరిస్తున్న వైనంపై ఇప్పుడు సరికొత్త చర్చకు తెర లేసిందనే చెప్పాలి.
Must Read ;- జగన్ జమానాలో ప్రజాస్వామ్యం ఖూనీ