తెలుగు నేల రాజకీయాల్లో గల్లా అరుణకుమారి ఫ్యామిలీకి ఓ మంచి గుర్తింపు ఉంది. అరుణకుమారి ఇటు రాజకీయాల్లో రాణిస్తుంటే.. ఆమె భర్త రామచంద్రనాయుడు వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నారు. ఇక వారి కుమారుడు గల్లా జయదేవ్ ఇటు వ్యాపారంతో పాటు అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం దిగువమాఘం గ్రామానికి చెందిన గల్లా ఫ్యామిలీ చంద్రగిరి నియోజకవర్గం కేంద్రం రాజకీయాలు నడుపుతోంది. జిల్లావ్యాప్తంగా అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పటిదాకా ఏ చిన్న వివాదం లేని ఈ కుటుంబంపై ఇప్పుడు ఏకంగా సామూహికంగా కేసులు నమోదు అయిపోయాయి. గల్లా జయదేవ్ తో పాటు అరుణకుమారి, రామచంద్రనాయుడు, జయదేవ్ సతీమణి గల్లా పద్మావతి సహా మొత్తం 12 మందిపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి. గల్లా ఫ్యామిలీలోని మొత్తం సభ్యులపై ఈ కేసులు నమోదు అయిన తీరు కలకలం రేపుతోదంది.
కోర్టు ఆదేశాలతోనే కేసులు
ఈ కేసులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని.. తన పోలంలోనే భారీగా ప్రహరీ గోడ నిర్మించారని గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకపోయిందట. ఇలాగైతే కాదనుకున్న ఆయన 2 నెలల క్రితం కోర్టును ఆశ్రయించారట. రైతు వాదనను పరిశీలించిన కోర్టు నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు సహా 12 మందిపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, సి.రామచంద్రరాజు, ట్రస్ట్ ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం.మోహన్ బాబు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, లాయర్ చంద్రశేఖర్‌లు ఉన్నారు.
ఆరేళ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకో..?
ఏపీలో జగన్ సీఎం అయ్యాక.. టీడీపీ చెందిన నేతలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు అవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నడూ లేనిది అమరరాజా ఫ్యాక్టరీ నుంచి కాలుష్యాలు విడుదలవుతున్నాయంటూ ఆ కంపెనీకి నోటీసులు అందాయి. అంతేకాకుండా జగన్ తండ్రి వైఎస్ సీఎంగా ఉండగా.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం సమీపంలో అమరరాజా విస్తరణ కోసం 500 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూ కేటాయింపులను కూడా జగన్ సర్కారు ఇటీవలే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మొత్తంగా గల్లా ఫ్యామిలీని జగన్ సర్కారు టార్గెట్ చేసిందన్న ఆరోపణలూ వినిపించాయి. అయితే ఈ రెండు విషయాల్లో పెద్దగా పట్టించుకోనట్లే వ్యవహరించిన గల్లా ఫ్యామిలీ.. ఇక్కడ కాకపోతే తమ కంపెనీ విస్తరణను తమిళనాడుకు తరలిస్తామన్నట్లుగా కూడా పీలర్లు వదిలినట్టుగా ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. అయితే వీటిని కూడా గల్లా ఫ్యామిలీ పట్టించుకోకపోవడంతో.. గల్లా ఫ్యామిలీని ఎలాగైనా ఇరికించాల్సిందేనన్న దిశగా సాగిన జగన్ సర్కారు.. దిగువమాఘం రైతు గోపీకృష్ణ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకుని అతడిని కోర్టు మెట్లెక్కించి.. గల్లా ఫ్యామిలీపై కేసులు నమోదయ్యేలా చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బద్వేల్ బైపోల్‌లో విక్టరీ టీడీపీదేనా?











