కోర్టు ఆదేశాల అమలు నవ్యాంధ్రలో ఫార్సుగా మారిపోయింది. కోర్టు ఆదేశాలంటే లెక్కేలేనట్టుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తుండగా.. జగన్ జమానాలో పనిచేస్తున్న తాము కూడా తక్కువేమీ కాదన్నట్లుగా ఐఏఎస్ లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురు ఐఏఎస్ లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తేల్చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి సీనియర్ ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య కూడా చేరిపోయారు. కోర్టు ధిక్కరణకు పాల్పడటమే కాకుండా ఏకంగా కోర్టు విచారణకు కూడా హాజరుకాని పూనంపై హైకోర్టు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఆమెతో పాటు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి చిరంజీవి చౌదరి కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా హైకోర్టు బుధవారం నాడు తేల్చేసింది. ఈ కేసులో పూనంతో పాటు చిరంజీవికి కూడా శిక్ష విధించింది. అయితే ఈ శిక్ష ఏమిటన్న విషయాన్ని ఈ నెల 29న వెల్లడించనున్నట్లుగా హైకోర్టు తెలిపింది.
కేసు ఏమిటంటే..?
సెరి కల్చర్ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమ సర్వీసును రెగ్యులర్ చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని, వారి సర్వీసులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని గతేడాది ఫిబ్రవరిలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సెరి కల్చర్ శాఖ అసలు పట్టించుకోనే లేదని చెప్పాలి. దీంతో మరోమారు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తాము ఆదేశాలు జారీ చేసినా.. ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదో చెప్పాలంటూ సంబంధిత శాఖల ఉన్నతాధికారులుగా ఉన్న పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై వారు ఇచ్చిన సమాధానంతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. అంతేకాకుండా తాము జారీ చేసిన ఆదేశాలను ఏడాదిన్నరకు పైగా సమయం గడుస్తున్నా అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కోర్టు తేల్చింది.
పూనంకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
కోర్టు ధిక్కరణకు పాల్పడిన పూనం, చిరంజీవిలకు శిక్ష విధించనున్నట్లుగా కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది. అయితే ఆ శిక్ష ఏమిటన్న విషయాన్ని ఈ నెల 29న వెల్డించనున్నట్లుగా ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణ సందర్భంగా చిరంజీవి చౌదరి కోర్టుకు హాజరు కాగా.. పూనం ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదట. దీంతో పూనం తీరుపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అంటే.. చిరంజీవి బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశమున్నా.. పూనంకు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందనే చెప్పాలి. విధి నిర్వహణలో సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్న పూనం ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నామధ్య విశాఖ మెడ్ టెక్ జోన్ లో అవినీతి వ్వవహారాల్లో పూనంకు పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపించాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కేసులో ఆమెకు ఏకంగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడం గమనార్హం.
Must Read ;- అటు హైకోర్టు, ఇటు లోకేశ్.. వాచిపోయిందిగా