Etela Rajendar Begins Padayatra Tomorrow :
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలు వేస్తున్నారు. హుజురాబాద్ లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ మంత్రులను రంగంలోకి దింపింది. ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజూరాబాద్ లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఇన్ చార్జ్ లను సైతం నియమించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ కేబినెట్ నుంచి వైదొలిగిన నాటి నుంచే హుజూరాబాద్ లో తిష్ట వేశారు. ధర్మాన్ని కాపాడుకోవడానికి, అహంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఉప ఎన్నికగా ఆయన అభివర్ణించారు. టిఆర్ఎస్ పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా గెలిచేది మాత్రం బీజేపీ నేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించిన ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
ప్రజా దీవెన యాత్రకు సిద్ధం
రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఈటల రాజేందర్ అన్నారు. ‘ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను’ ని చెప్పారు. ఉదయం 7.30 లకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభంకానుంది. ‘‘నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు. ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి’’ అని ఈటల పిలుపునిచ్చారు.
జమున పోటీలో నిలిచేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఈటల రాజేందర్ భార్య జమున నిలుస్తుందనే వార్తలు వినిపించాయి. ఎమ్మెల్యేగా జమునను గెలిపించుకొని, రాజేందర్ ఢిల్లీలో చక్ర తిప్పాలని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిపై ఈటల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఈటల రాజేందర్ పోటీ చేసినా.. తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం, ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ బిజీగా ఉన్నప్పుడు తాను ప్రచారం చేశానని గుర్తు చేశారు.
Etela Rajendar :
ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుండి శ్రీకారం చుడుతున్నాను. (1/3) pic.twitter.com/1OWBxs4rj6
— Eatala Rajender (@Eatala_Rajender) July 18, 2021