దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను బీజేపీ ఏపీ ఇంఛార్జి సునీల్ దేవధర్ తీవ్రంగా ఖండించారు. రామతీర్థంలో రాముడికి జరిగిన అన్యాయం భారత దేశం మొత్తానికి జరిగిన అవమానమని ఆయన శ్రీకాళహస్తిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక ఏసుక్రీస్తుకు, శ్రీకృష్ణుడికి మధ్య జరిగే ఎన్నికగా ఆయన పోల్చారు. జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోక్షమించేది లేదని ఆయన మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దేవధర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.
ఏపీలో శాంతి,భద్రతలున్నాయా?
ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సునీల్ దేవధర్ విమర్శించారు. జగన్ సీఎం పదవికి అనర్హుడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో బీజేపీ, జనసేన చేసి చూపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో జనసేన, బీజేపీ తరపున ఎవరు పోటీ చేసినా మోడీ పోటీ చేసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే వైసీపీలో ఉన్న హిందూ ప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి











