దేశంలో బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు ఆ రాష్ట్రాల్లోని పార్టీలకు అగ్నిపరీక్షగా మారుతున్నాయి. ఇందుకు సామ, దాన , బేధ , దండోపాయాల వ్యూహం కూడా అమలవుతోందని చెప్పవచ్చు. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక విజయం, జీహెచ్ఎంసీలో గణనీయమైన సానుకూల ఫలితాలు సాధించడంతో తెలంగాణలో బీజేపీ వ్యూహాలు వేగమయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ టార్గెట్ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక. అంటే దుబ్బాకలో గెలిచి..ఆ జోష్ జీహెచ్ఎంసీలోనూ కొనసాగించి..రానున్న ఎన్నికల్లో విజయం దిశగా బాటలు వేసుకుంటున్న వ్యూహం చూడొచ్చు.
ఏపీలోనూ ఈ రీతిలోనే బాటలు వేసుకోవాలని..
ఏపీలోనూ బీజేపీ ఈ రీతిలోనే బాటలు వేసుకుంటుందా అనే చర్చ మొదలైంది. ఏపీలో బీజేపీ కన్ను తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతో పాటు ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై పండిందని చెప్పవచ్చు. ఇందుకు ఆ పార్టీ అమలు చేసే వ్యూహాలు ఏపీలో వైసీపీ, టీడీపీలకు ముచ్చెమటలు పట్టించే అవకాశం కూడా కనిపిస్తోంది. తిరుపతిలో ఈ సారి పొత్తు లేకుండా (జనసేన కలిసే ఉంటుంది) గెలిస్తే.. ఏపీలో ఒంటరిగా గెలిచిన మొదటి ఎంపీ సీటుగా బీజేపీ రికార్డు నెలకొల్పుతుంది. గతంలో చాలాసార్లు పోటీ చేసినా, విజయం సాధించినా.. పొత్తులు ఉన్నాయి. ఈ సారి జనసేన, బీజేపీ రెండూ ఒకటై బరిలోకి దిగనున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ గతంలో ఓసారి గెలిచినా.. టీడీపీతో పొత్తు ఉంది. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నందిపాక వెంకటస్వామి గెలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి (టీడీపీ పొత్తు) కారుమంచి జయరామ్‌పై వైఎస్సార్సీపీకి చెందిన వెలగపల్లి వరప్రసాద్ 37 వేలకు పైగా ఓట్లతో గెలిచారు. ఇక 2019లో బీజేపీకి 16వేలు, 2009లో 21వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ గెలిచింది. బీఎస్పీ, జనసేన అభ్యర్థికి 20వేల ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం మీద బీజేపీ, జనసేనకు కలిపి గరిష్టంగా 40వేల ఓట్లు ఉంటాయని చెప్పవచ్చు. అంటే 15లక్షల ఓట్లతో పోల్చితే ఆ పర్సెంటేజీ చాలా తక్కువే. అయినా ఆ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉందని చెప్పవచ్చు.
అలా గెలిస్తే.. వైసీపీ, టీడీపీలకు తామే ప్రత్యామ్నాయమని చెప్పి తరువాత జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అధికారం దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ఒకవేళ గెలవకున్నా.. వైసీపీ గెలిచి..బీజేపీ రెండో స్థానంలో ఉంటే..టీడీపీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. వలసలు పెరగడంతో పాటు.. మరో రాజకీయ ప్రత్యర్థిని టీడీపీ ఎదుర్కోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత కష్టం కానుంది. వీటిల్లో ఏది జరిగినా బీజేపీకి భారీగా ప్రయోజనం చేకూరుతుంది.
సంజయ్ మార్గంలో.. సోము
ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడయ్యాక తెలంగాణలో బీజేపీ దుబ్బాకలో గెలిచింది. జీహెచ్ఎంసీలో మంచి ఫలితాలు సాధించింది. ఈ ఫలితాలే ఆదర్శంగా తీసుకున్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా తన కార్యాచరణలో వేగం పెంచారని చెప్పవచ్చు. అక్కడ కార్యవర్గ సమావేశం పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేయడం, తిరుపతి ప్రగతికి బీజేపీయే చిరునామా అని చెప్పడం అందులో భాగమని చెప్పవచ్చు. అంతే కాకుండా.. తెలంగాణలో టీఆర్ఎస్ ఓ వర్గానికి కొమ్ము కాస్తోందని, ఏపీలోనూ మరో వర్గానికి వైసీపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, ఈ రెండు రాష్ట్రాల్లో హిందువులను నిర్లక్ష్యం చేస్తున్నారనే అర్థం వచ్చేలా బండి సంజయ్ గతంలో కామెంట్లు చేశారు. వీటిపై ఏపీ బీజేపీ నుంచి సానుకూల స్పందనే కనిపించింది. అంటే.. ఏపీలో బీజేపీ అనుసరించనున్న వైఖరికి ఈ స్పందనే సూచికగా చెప్పవచ్చు.
ఉప ప్రాంతీయ వాదం
తాజాగా ఏపీలో మరో వాదన కూడా బీజేపీకి కలిసి రానుంది. మాజీ ఎంపి గంగు ప్రతాపరెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి వంటి వారు గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ ముందుకు తెచ్చారు. ఆ అంశాలను కూడా బీజేపీ వినియోగించుకోనుంది. తిరుపతి ఉప ఎన్నిక ముగిసే వరకు రాజధాని మార్పు అంశాన్ని పక్కన బెట్టే దిశగా సరికొత్త ప్రాంతీయ వాదనలు తెరపైకి వస్తాయన్న అంచనాలూ ఉన్నాయి.. ఆలయాలపై దాడులు.. ఘర్షణలు అదనపు అస్త్రాలుగా మార్చుకోనుంది బీజేపీ. పుణ్యక్షేత్ర కేంద్రమైన తిరుపతిలో హిందూత్వ అంశం ఎలాగూ బీజేపీ సొంత అజెండాగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
దుబ్బాకలో అభ్యర్థి..
అయితే, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు..ఆ నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు. మూడుసార్లు ఓడిపోయి ఉన్నాడు. పక్కనే ఉన్న సిద్దిపేట (హరీష్ రావు), గజ్వేల్ (కేసీఆర్) నియోజకవర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో దుబ్బాకకు ఇస్తున్న నిధులను పోల్చినప్పుడు.. కచ్చితంగా దుబ్బాక ఓటర్లలో చాలా మందికి టీఆర్ఎస్‌పై కోపం రావడం సహజమే. అది ఆ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయింది. మరి తిరుపతిలో పైన చెప్పినవి కాకుండా ఏ అంశాలను బీజేపీ తెరపైకి తెస్తుందనేది చూడాలి. తిరుపతిలో బీజేపీ గెలిస్తే.. అది పార్టీకి బంపర్ లాటరీగా మారనుంది. రెండో స్థానం వచ్చినా.. వైసీపీకి, టీడీపీకి ముచ్చెమటలు రావడం ఖాయం. అదే టైంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మరింత స్పీడ్ గా జరుగుతుందని చెప్పవచ్చు.
Also Read: తిరుపతి ఎంపీ సీటు ఆ మాజీ మంత్రికి కావాలట !