తమిళనాడులోని పుదుచ్చేరి ప్రాంతంలో ఈ ఉదయం తీరందాటిన అతితీవ్ర తుఫాన్ నివర్ తో ఏపీలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు స్వర్ణముఖి ఉదృతంగా ప్రవహిస్తోంది. పూతలపట్టు, శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తవనంపల్లి, యాదమర్రి, బంగారుపాళ్యం, ఐరాల ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఏర్పేడు మండలంలోని మల్లెమడుగు ప్రాజెక్టు గేట్లు ఒక్కసారిగా ఎత్తడంతో వరద ముంచెత్తింది. ముగ్గురు రైతులు వరదలో చిక్కుకున్నారు. ఇద్దరిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మరొకరికోసం గాలిస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని రెండు చెరువులకు గండ్లు పడ్డాయి. చింతల, యార్లపూడి చెరువులకు గండ్లు పడటంతో వందలాది ఎకరాలల్లో పంట నీటమునిగింది. భారీ వర్షాలకు తిరుమల కనుమదారిలో కొండరాళ్లు విరిగిపడ్డాయి. పాపవినాశనం, కళ్యాణి డ్యామ్ లు నిండుకుండల్లా మారాయి. తిరుపతిలోని కపిలతీర్థం జలపాతం బీభత్సంగా గర్జిస్తోంది.
నెల్లూరులో భారీ వర్షాలు
నెల్లూరు జిల్లా ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం లేదని కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 115 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 15 రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. వెంకటగిరి కుర్జాకుంట రహదారిలో వరద ఉదృతికి వంతెన తెగిపోవడంతో రవాణా నిలిచిపోయింది. కలికిరి కావలి ప్రధాన రహదారిపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలు స్థంభించాయి. నెల్లూరు పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా కల్పించారు.
కడపలో నిలిచిపోయిన రాకపోకలు
కడప జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కడప జిల్లా పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. అన్నమయ్య ప్రాజెక్టుకు 18 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. అధికారులు అప్రమత్తం అయ్యారు. సర్వారాయసాగర్ కు ఇందుకూరు వద్ద రెండు గండ్లు పడ్డాయి. అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజంపేట ఊటుకూరు వద్ద వరద ప్రవాహం ముంచెత్తుతోంది. కడప తిరుపతి రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట నుంచి రాయచోటి, పీలేరు మీదుగా వాహనాలను మళ్లించారు. ఖరీఫ్ వరి కోతలకు వచ్చిన ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది.
Also Read ;- ఎవరికైనా ఇదే గతి;
ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు
ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పంటనష్టం తీవ్రంగా ఉంది. మూడు జిల్లాల్లోని 14 లక్షల ఎకరాల్లో వరిపంట నూర్పిడికి సిద్దంగా ఉంది. భారీ వర్షాలు ముంచెత్తడంతో వరిపైరు నేలకొరిగింది. మిషన్ కటింగ్ చేయడం కూడా సాధ్యం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రైతుకు తీవ్రనష్టం
ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో నివర్ తుఫాను వరిపంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఖరీప్ వరిపంట చేతికొచ్చింది. నూర్పిడి చేయించే సమయంలో వర్షాలు రావడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. లక్షలాది ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. వర్షాలు పెరిగితే నష్టం ఇంకా తీవ్రం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. నూర్పిడికి వచ్చిన వరి పంట తడవడంతో ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. పంట పెరికే సమయంలో వచ్చిన వర్షాలకు వేరుశనగకాయలు మొలకలెత్తుతున్నాయని రైతులు తెలిపారు. మరో 24 గంటలు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరించారు.
Must Read ;- భీమసింగి షుగర్స్‌ను ఉంచుతారా..? ముంచుతారా ..?