డ్రగ్స్ రాకెట్ మళ్లీ కదులుతోంది. ముంబయిలో ఎన్సీబీ జరిపిన దాడుల్లో ఓ తెలుగు నటితో పాటు చాంద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీంతో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయినట్టయింది. ముంబైలోని మీరా రోడ్ లో ఓ హోటల్ పై ఎన్సీబీ అధికారులు దాడులు చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. టాలీవుడ్ నటి నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నటి ఎవరన్నది తెలియరాలేదు.
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా భారీగా డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు ఎన్సీబీ దగ్గర సమాచారముంది. అందులో భాగంగానే ఈ దాడులు నిర్వహిస్తున్నారు. సద్దుమణిగిందనుకున్న ఈ డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ కదిలింది. ఈ కేసుల్లో ఊపిరి పీల్చుకున్న నటుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఎప్పుడు ఎవరి పేరు తెర మీదికి వస్తుందోనన్న భయం అందరిలోనూ ఉంది.
ఎవరా నటి? ఏమా కథ?
ముంబైలోని ఓ హో టల్ గదిలో ఉన్న ఆ టాలీవుడ్ నటి ఎవరన్నది ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆమె పేరును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఎందుకు వెల్లడించడంలేదన్నది కూడా ఓ ప్రశ్నే. ఆమె జనవరి 1 నుంచి సయీద్ తో ఈ హోటల్ గదిలో ఉన్నట్టు సమాచారం. గతంలో అనేక పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆమె నుంచి 400 గ్రాముల మెఫిడ్రిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెతో పాటు చాంద్ మహమ్మద్ షేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వారికి ఈ డ్రగ్స్ ను సరఫరా చేసిన సయీద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీటి విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. ఇంతకుముందు ఈ కేసులో దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఎన్‌సిబి ప్రశ్నించింది. అర్జున్ రాంపాల్, అతని ప్రియురాలిని కూడా ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయన్నది వేచి చూడాలి. కేవలం డ్రగ్స్ కోసమే బయటి నుంచి అనేక మంది ముంబైకి వస్తున్నట్టు తెలుస్తోంది.